మహావిషాదం: 100 మందిపైగా మృతి
కొల్లమ్: కేరళలో మహా విషాదం చోటుచేసుంది. ఆలయ సన్నిధిలో 100 మందిపైగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా పేల్చిన బాణసంచా భక్తుల పాలిట మృత్యుపాశంగా మారింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.\
పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఎంతమంది చనిపోయారన్నది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆక్రందనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. బాణాసంచా పేలుడు సందర్భంగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసిపడడంతో శరవేగంగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.
మంటలు భారీగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భక్తులు విలవిల్లాడారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునే బాణాసంచా పేలుడు భక్తుల మృతికి కారణమవడం గమనార్హం.