Puttingal temple fire
-
పుట్టంగల్ ఘటనలో ఐదుగురి లొంగుబాటు
కొల్లాం: పుట్టంగల్ ఆలయంలో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి అయిదుగురు ఆలయ అధికారులు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆలయ ట్రస్టీ అధ్యక్షుడు జయలాల్, సెక్రటరీ జె కృష్ణకుట్టీ, ట్రెజరర్ శివప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు సురేంద్రన్ పిళ్ళై, రవీంద్రన్ పిళ్ళై లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం వీరంతా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కొల్లాంలో ఉన్న పుట్టింగల్ ఆలయంలో జరిగే కాళికా దేవి ఉత్సవాల్లో ఆదివారం నిర్వహించిన బాణసంచా వేడుక వికటించి 110మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 383మంది తీవ్రగాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనపై క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసు ఇవాళ కేరళ హైకోర్టులో విచారణకు రానుంది. -
కేరళ అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురి అరెస్ట్
కొల్లం: పుట్టంగల్ ఆలయంలో మారణహోమానికి కారణమైనవారిలో ఐదుగురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసంచా పేలుడుతో సంబంధమున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ డీజీపీ తెలిపారు. మరోవైపు పుట్టంగల్ ఆలయంలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని పోలీసు అధికారుల బృందం ఈ ఉదయం పరిశీలించింది. భారీ పేలుడుకు దారితీసిన కారణాలను అన్వేషించింది. గుడి' మంటల్లో మృతి చెందిన వారి సంఖ్య 107 అని కేరళ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కొల్లాం జిల్లా పరువూర్లోని పుట్టంగల్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా పేలుడు సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుంది. బాణసంచా నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలో నిప్పురవ్వలు పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. 107 మంది ప్రాణాలు కోల్పోగా, 383 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు తిరువనంతపురం మెడికల్ కాలేజీ, కొల్లాంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. -
'అవసరమైతే ముంబై, ఢిల్లీకి తరలిస్తాం'
తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్ పుట్టింగళ్ దేవీ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అవసరమైతే క్షతగాత్రులను ముంబై లేదా ఢిల్లీకి తరలించి మెరుగైన వైద్యం అందించడానికి సాయం చేస్తామని మోదీ చెప్పారు. బాధితులను ఆదుకునే విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో మాట్లాడానని చెప్పారు. ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాద ఘటన జరగడం చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని పరిశీలించిన మోదీ స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కొల్లాం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, అధికారుతో సమావేశమై చర్చించారు. పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. -
పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన మోదీ
తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో అగ్నిప్రమాదం జరిగిన పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. అగ్నిప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోదీ పరామర్శించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అంతకుముందు కొల్లాంలో మోదీకి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్వాగతం పలికారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను మోదీకి వివరించారు. మోదీ, చాందీ, కేంద్ర మంత్రి జేపీ నద్దా కలసి.. కొల్లాంలోని ఏఏ రహీం స్మారక ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యం ఉన్న డాక్టర్ల బృందాన్ని మోదీ తనతో కేరళకు తీసుకువెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తిరువనంతపురం వచ్చారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ఆయనకు కేరళ గవర్నర్ పి సదాశివం, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లో కొల్లాంకు చేరుకున్నారు. పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన వార్త వినగానే మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నావికాదళ, వాయుసేనలను సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని ఆదేశించారు. చదవండి: (మహావిషాదం: 100 మందిపైగా మృతి) (మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు) -
అవి కూడా పేలివుంటే...
కొల్లమ్: కేరళలో కొల్లమ్ జిల్లా పుట్టింగళ్ దేవీ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 100 మందిపైగా మృతి చెందారు. 200 మందిపైగా గాయపడ్డారు. బాణాసంచా పేలుడు ధాటికి ఆలయం ప్రాంగణంలోని కట్టడాలు కుప్పకూలింది. పెద్ద ఎత్తున వ్యాపించిన అగ్నికీలల్లో వందమందిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత ఘటనా స్థలంలో దృశ్యాలు భీతిగొల్పుతున్నాయి. పేలని బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో లభ్యమైన పేలుడు పదార్థాలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇవి కూడా పేలివుంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పెద్దమొత్తంలో రక్తం అవసరమవుతుందని, రక్తదాతలు ముందు రావాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మహావిషాదానికి కారణమైన పట్టింగళ్ ఆలయ బోర్డు అధికారులపై కేసు నమోదు చేశారు. బాధితుల వివరాల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నంబర్లు: 0474 2512344, 9497960778, 9497930869 -
మహావిషాదం: 100 మందిపైగా మృతి
కొల్లమ్: కేరళలో మహా విషాదం చోటుచేసుంది. ఆలయ సన్నిధిలో 100 మందిపైగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా పేల్చిన బాణసంచా భక్తుల పాలిట మృత్యుపాశంగా మారింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.\ పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఎంతమంది చనిపోయారన్నది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆక్రందనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. బాణాసంచా పేలుడు సందర్భంగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసిపడడంతో శరవేగంగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భక్తులు విలవిల్లాడారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునే బాణాసంచా పేలుడు భక్తుల మృతికి కారణమవడం గమనార్హం.