ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారుల బృందం
కొల్లం: పుట్టంగల్ ఆలయంలో మారణహోమానికి కారణమైనవారిలో ఐదుగురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసంచా పేలుడుతో సంబంధమున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ డీజీపీ తెలిపారు. మరోవైపు పుట్టంగల్ ఆలయంలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని పోలీసు అధికారుల బృందం ఈ ఉదయం పరిశీలించింది. భారీ పేలుడుకు దారితీసిన కారణాలను అన్వేషించింది. గుడి' మంటల్లో మృతి చెందిన వారి సంఖ్య 107 అని కేరళ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
కొల్లాం జిల్లా పరువూర్‌లోని పుట్టంగల్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా పేలుడు సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుంది. బాణసంచా నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలో నిప్పురవ్వలు పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. 107 మంది ప్రాణాలు కోల్పోగా, 383 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు తిరువనంతపురం మెడికల్ కాలేజీ, కొల్లాంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది.