'అవసరమైతే ముంబై, ఢిల్లీకి తరలిస్తాం'
తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్ పుట్టింగళ్ దేవీ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అవసరమైతే క్షతగాత్రులను ముంబై లేదా ఢిల్లీకి తరలించి మెరుగైన వైద్యం అందించడానికి సాయం చేస్తామని మోదీ చెప్పారు. బాధితులను ఆదుకునే విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో మాట్లాడానని చెప్పారు. ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాద ఘటన జరగడం చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అంతకుముందు పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని పరిశీలించిన మోదీ స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కొల్లాం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, అధికారుతో సమావేశమై చర్చించారు. పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు.