పుట్టంగల్ ఘటనలో ఐదుగురి లొంగుబాటు
కొల్లాం: పుట్టంగల్ ఆలయంలో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి అయిదుగురు ఆలయ అధికారులు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆలయ ట్రస్టీ అధ్యక్షుడు జయలాల్, సెక్రటరీ జె కృష్ణకుట్టీ, ట్రెజరర్ శివప్రసాద్తో పాటు మరో ఇద్దరు సురేంద్రన్ పిళ్ళై, రవీంద్రన్ పిళ్ళై లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం వీరంతా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
కొల్లాంలో ఉన్న పుట్టింగల్ ఆలయంలో జరిగే కాళికా దేవి ఉత్సవాల్లో ఆదివారం నిర్వహించిన బాణసంచా వేడుక వికటించి 110మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 383మంది తీవ్రగాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనపై క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసు ఇవాళ కేరళ హైకోర్టులో విచారణకు రానుంది.