అవి కూడా పేలివుంటే...
కొల్లమ్: కేరళలో కొల్లమ్ జిల్లా పుట్టింగళ్ దేవీ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 100 మందిపైగా మృతి చెందారు. 200 మందిపైగా గాయపడ్డారు. బాణాసంచా పేలుడు ధాటికి ఆలయం ప్రాంగణంలోని కట్టడాలు కుప్పకూలింది. పెద్ద ఎత్తున వ్యాపించిన అగ్నికీలల్లో వందమందిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత ఘటనా స్థలంలో దృశ్యాలు భీతిగొల్పుతున్నాయి.
పేలని బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో లభ్యమైన పేలుడు పదార్థాలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇవి కూడా పేలివుంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పెద్దమొత్తంలో రక్తం అవసరమవుతుందని, రక్తదాతలు ముందు రావాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు.
కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మహావిషాదానికి కారణమైన పట్టింగళ్ ఆలయ బోర్డు అధికారులపై కేసు నమోదు చేశారు. బాధితుల వివరాల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నంబర్లు: 0474 2512344, 9497960778, 9497930869