పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన మోదీ
తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో అగ్నిప్రమాదం జరిగిన పుట్టింగళ్ దేవీ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. అగ్నిప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోదీ పరామర్శించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అంతకుముందు కొల్లాంలో మోదీకి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్వాగతం పలికారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను మోదీకి వివరించారు. మోదీ, చాందీ, కేంద్ర మంత్రి జేపీ నద్దా కలసి.. కొల్లాంలోని ఏఏ రహీం స్మారక ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యం ఉన్న డాక్టర్ల బృందాన్ని మోదీ తనతో కేరళకు తీసుకువెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తిరువనంతపురం వచ్చారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ఆయనకు కేరళ గవర్నర్ పి సదాశివం, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లో కొల్లాంకు చేరుకున్నారు.
పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన వార్త వినగానే మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నావికాదళ, వాయుసేనలను సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని ఆదేశించారు.
చదవండి:
(మహావిషాదం: 100 మందిపైగా మృతి)
(మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు)