సొంత రాజ్యం... సొంత చట్టాలు
గూడు లేని పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే ప్రతాపం చూపే అధికారులు... మథురలోని 260 ఎకరాల స్థలాన్ని రెండేళ్ల క్రితం ఆక్రమించుకుంటే ఇంతకాలం ఏం చేశారు. పోలీసుల కంటే శక్తివంతమైన ఆయుధాలు ఆక్రమణదారులకు ఎలా వచ్చాయి ? జవహర్ బాగ్‌లోని వందల ఎకరాల్లో ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ ఏకంగా సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అరాచకపాలన సాగిస్తుంటే ఎందుకు మౌనం వహించారు ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. సత్యాగ్రహి చర్యలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి.
మథుర: సత్యాగ్రహి.... ఒక ఛాందసవాద సంస్థ... ఆక్రమిత స్థలంలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని... కోర్టులు, జైలు గదుల్ని నిర్మించి స్వతంత్ర పాలన సాగిస్తోంది. ఈ గ్రూపు నియమాల్ని అతిక్రమిస్తే చిత్రహింసలు గురిచేయడంతో పాటు జైలు శిక్ష విధిస్తారు. భారత రాజ్యాంగాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వీరు ఆక్రమిత స్థలంలో టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికే కావాల్సిన ఆహారపదార్థాల్ని తెప్పించుకుంటారు. ప్రవచన కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్ని నిర్మించుకున్నారు. సాయుధులతో ఆర్మీ లాంటి బెటాలియన్‌నే ఏర్పాటు చేసుకున్నారు. బయటి వ్యక్తులు, అధికారులు వారి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తే దాడి చేయడం వీరి పని. ఆశ్రమంలోని అనుచరుల్ని కూడా బయటకు వెళ్లనివ్వరు. ఒకవేళ బయటకు వెళ్లాలంటే లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సిందే.
ఒకటి రెండు రోజుల కంటే బయట ఉండకూడదు.. అయితే వీరంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారిగా భావిస్తున్నారు. వీరి ప్రధాన లక్ష్యం ప్రజల్ని మత తీవ్రవాదం, మత ఉగ్రవాదం వైపు మళ్లించడం. భారత్ కరెన్సీ నిరాకరించిన ఈ గ్రూపు సొంత కరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని పోలీసులు వెల్లడించారు. భారత రాజ్యాంగంతోపాటు చట్టాల్ని కూడా వీరు అంగీకరించరని పోలీసులు చెప్పారు. అధికారుల అధికారాల్ని అంగీకరించని వీరు మాట్లాడేందుకు సైతం నిరాకరిస్తున్నారన్నారు. ఈ హింసకు ముఖ్య కారకుడిగా అనుమానిస్తున్న రామ్ వ్రిక్ష యాదవ్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అనుచరులతో అతను తప్పించుకున్నాడని భావిస్తున్నా... చనిపోయిన 22 మందిలో ఆయన ఒకడని పోలీసులు చెబుతున్నారు.
కుదుటపడుతున్న జవహర్‌బాగ్
హింసతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శనివారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జవహర్ నగర్ ప్రాంతంలో కూబింగ్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. పోలీసు బృందాలు, నిపుణులు ఆ ప్రాంతంలో అణువణువూ పరిశీలిస్తున్నారు. హింస చెలరేగిన ప్రాంతాన్ని సురక్షితంగా ప్రకటించక పోవడంతో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా మరణించారా అన్నది చెప్పడం కష్టమని మథుర పోలీసులు తెలిపారు. మరోవైపు అఖిలేష్ ప్రభుత్వంపై విపక్షాల ఎదురుదాడి కొనసాగుతోంది. ట్విటర్‌లో షూటింగ్ ఫోటోలు పెట్టి వివాదాస్పదమైన బీజేపీ ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. అఖిలేష్ ప్రభుత్వమే ఘటనకు బాధ్యత వహించాలని, శాంతి భద్రతలపై మరింత దృష్టిపెట్టాలని చెప్పారు. మథుర సంఘటన తెలిశాక అన్ని షూటింగ్‌లను రద్దు చేసుకుని శుక్రవారం రాత్రే మథుర చేరుకున్నానని ఆమె తెలిపారు. జవహర్ బాగ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు హేమా మాలిని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల రీత్యా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు.
మథుర ఘటనను యూపీ సీఎం అఖిలేష్ సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఘటన స్థలాన్ని సందర్శించడం మానేసి బుందేల్‌ఖండ్‌లో పర్యటించడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సీబీఐ విచారణ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే మథుర ఘర్షణలు జరిగాయని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో విమర్శించారు. దాడికి పాల్పడ్డవారిలో అఖిలేష్ మంత్రి వర్గంలోని శివపాల్ సింగ్ యాదవ్ అనుచరున్నారంటూ యూపీ బీజేపీ ఆరోపించింది. శివపాల్ యాదవ్ రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు.