Mathura violence
-
విహార స్థలంగా జవహర్ బాగ్!
మథుర: హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మథురలోని జవహర్ బాగ్ ను విహారయాత్ర స్థలంగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న 270 ఎకరాల్లోని కొంత స్థలంలో అమూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 2న జవహర్ బాగ్ లో కబ్జాదారులకు, పోలీసులకు మధ్య మథురలో జరిగిన యుద్ధంలో ఇద్దరు పోలీసు అధికారులతో సహా 24 మంది మృతి చెందారు. సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొగ్గ తొడినట్టు తెలుస్తోంది. ముందుగా 100.22 ఎకరాల స్థలాన్ని ఉద్యాన శాఖ అప్పగించి పార్క్ అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పార్క్ డిజైన్ కోసం ప్రైవేటు ఆర్కిటెక్ ను బుధవారం ప్రభుత్వం సంప్రదించిందని తెలిపాయి. -
మథుర ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
బస్తీ: మథుర ఘర్షణల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని పరశురాంపుర ప్రాంతంలోని ఓ గ్రామంలో బుధవారం అరెస్టు చేశారు. చందన్ బోస్, అతని భార్యను కైత్ వాలియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున మథుర పోలీసుల టీమ్ అరెస్టు చేసినట్లు ఎస్పీ కృపా శంకర్ సింగ్ తెలిపారు. మథుర ఘర్షణలకు కారణమైన ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కు అధ్యక్షుడిగా పనిచేసిన రామ్ వృక్ష్ యాదవ్ కు బోస్ ప్రధాన అనుచరుడు. కాగా, యాదవ్ మథుర గొడవల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీపీ దల్జీత్ సింగ్ రామ్ వృక్ష్ యాదవ్, చందన్ బోస్, గిరీశ్ యాదవ్, రాకేశ్ గుప్తాలను కేసులో నేరస్తులుగా ప్రకటించిన విషయం విదితమే. జూన్ 2న మథురలోని జవహార్ బాగ్ వద్ద జరిగిన ఈ ఘర్షణలో మథుర ఎస్పీ, స్టేషన్ హోస్ ఆఫీసర్ లతో పాటు మొత్తం 29 మంది మరణించారు. -
చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ ముఖుల్ ద్వివేది భార్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత బాధ్యతలు అప్పగించింది. ఆయన భార్య అయిన అర్చనా ద్వివేదిని సంక్షేమ శాఖకు ఓఎస్డీగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మథురలో చోటుచేసుకున్న ఘర్షణల్లో మొత్తం 29మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. ఇలా ప్రాణాలుకోల్పోయినవారిలో ఎస్పీ ముఖుల్ ద్వివేది కూడా ఉన్నారు. విధుల్లో ఉండి ఆయన అకాలంగా ఆయన మరణించడంతో ఈ విషయంపై గురువారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆమెకు ఓఎస్డీగా నియామకం ఖరారు చేస్తూ రాష్ట్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. -
మథుర ఘర్షణల్లో యూఎస్ రాకెట్ లాంచర్
మథుర: ఉత్తర ప్రదేశ్ మథుర హత్యాకాండ జరిగిన ఘటనా స్థలం వద్ద అమెరికాకు చెందిన అధునాతన రాకెట్ లాంచర్ ను పోలీసులు గుర్తించారు. వీటిని పరిశీలించేందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికార్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రాకెట్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నాక నిపుణులను పిలిచి వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని మథుర జిల్లా ఎస్పీ బబ్లు కుమార్ యాదవ్ చెప్పారు. ఇవి ఎవరివి, ఎక్కడి నుండి వచ్చాయో చేధించాల్సి వుందని ఆయన చెప్పారు. ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి ఆక్రమించుకున్న 280 ఎకరాల స్థలంలో సోదాలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఈ ఆయుధాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఆందోళనకారులు ఆక్రమించుకున్న స్థలాన్ని కోర్టు ఆదేశాల మేరకు ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై దాడికి దిగడంతో ఎస్పీ, ఓ పోలీసుతో సహా మొత్తం29 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
మథుర ఘర్షణలపై సీబీఐ విచారణకు సుప్రీం నో
న్యూఢిల్లీ : మథురలో జరిగిన ఘర్షణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్ మథురలోని జవహర్‌బాగ్ లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో 29మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 3000 మంది ఆక్రమణదారులపై 45 కేసులు నమోదు చేశారు. మథురలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ... యూపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరోవైపు విపక్షాలు కూడా ఈ హింసాత్మక ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. -
సొంత రాజ్యం... సొంత చట్టాలు
గూడు లేని పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే ప్రతాపం చూపే అధికారులు... మథురలోని 260 ఎకరాల స్థలాన్ని రెండేళ్ల క్రితం ఆక్రమించుకుంటే ఇంతకాలం ఏం చేశారు. పోలీసుల కంటే శక్తివంతమైన ఆయుధాలు ఆక్రమణదారులకు ఎలా వచ్చాయి ? జవహర్ బాగ్‌లోని వందల ఎకరాల్లో ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ ఏకంగా సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అరాచకపాలన సాగిస్తుంటే ఎందుకు మౌనం వహించారు ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. సత్యాగ్రహి చర్యలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. మథుర: సత్యాగ్రహి.... ఒక ఛాందసవాద సంస్థ... ఆక్రమిత స్థలంలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని... కోర్టులు, జైలు గదుల్ని నిర్మించి స్వతంత్ర పాలన సాగిస్తోంది. ఈ గ్రూపు నియమాల్ని అతిక్రమిస్తే చిత్రహింసలు గురిచేయడంతో పాటు జైలు శిక్ష విధిస్తారు. భారత రాజ్యాంగాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వీరు ఆక్రమిత స్థలంలో టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికే కావాల్సిన ఆహారపదార్థాల్ని తెప్పించుకుంటారు. ప్రవచన కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్ని నిర్మించుకున్నారు. సాయుధులతో ఆర్మీ లాంటి బెటాలియన్నే ఏర్పాటు చేసుకున్నారు. బయటి వ్యక్తులు, అధికారులు వారి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తే దాడి చేయడం వీరి పని. ఆశ్రమంలోని అనుచరుల్ని కూడా బయటకు వెళ్లనివ్వరు. ఒకవేళ బయటకు వెళ్లాలంటే లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సిందే. ఒకటి రెండు రోజుల కంటే బయట ఉండకూడదు.. అయితే వీరంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారిగా భావిస్తున్నారు. వీరి ప్రధాన లక్ష్యం ప్రజల్ని మత తీవ్రవాదం, మత ఉగ్రవాదం వైపు మళ్లించడం. భారత్ కరెన్సీ నిరాకరించిన ఈ గ్రూపు సొంత కరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని పోలీసులు వెల్లడించారు. భారత రాజ్యాంగంతోపాటు చట్టాల్ని కూడా వీరు అంగీకరించరని పోలీసులు చెప్పారు. అధికారుల అధికారాల్ని అంగీకరించని వీరు మాట్లాడేందుకు సైతం నిరాకరిస్తున్నారన్నారు. ఈ హింసకు ముఖ్య కారకుడిగా అనుమానిస్తున్న రామ్ వ్రిక్ష యాదవ్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అనుచరులతో అతను తప్పించుకున్నాడని భావిస్తున్నా... చనిపోయిన 22 మందిలో ఆయన ఒకడని పోలీసులు చెబుతున్నారు. కుదుటపడుతున్న జవహర్‌బాగ్ హింసతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శనివారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జవహర్ నగర్ ప్రాంతంలో కూబింగ్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. పోలీసు బృందాలు, నిపుణులు ఆ ప్రాంతంలో అణువణువూ పరిశీలిస్తున్నారు. హింస చెలరేగిన ప్రాంతాన్ని సురక్షితంగా ప్రకటించక పోవడంతో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా మరణించారా అన్నది చెప్పడం కష్టమని మథుర పోలీసులు తెలిపారు. మరోవైపు అఖిలేష్ ప్రభుత్వంపై విపక్షాల ఎదురుదాడి కొనసాగుతోంది. ట్విటర్లో షూటింగ్ ఫోటోలు పెట్టి వివాదాస్పదమైన బీజేపీ ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. అఖిలేష్ ప్రభుత్వమే ఘటనకు బాధ్యత వహించాలని, శాంతి భద్రతలపై మరింత దృష్టిపెట్టాలని చెప్పారు. మథుర సంఘటన తెలిశాక అన్ని షూటింగ్‌లను రద్దు చేసుకుని శుక్రవారం రాత్రే మథుర చేరుకున్నానని ఆమె తెలిపారు. జవహర్ బాగ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు హేమా మాలిని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల రీత్యా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. మథుర ఘటనను యూపీ సీఎం అఖిలేష్ సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఘటన స్థలాన్ని సందర్శించడం మానేసి బుందేల్‌ఖండ్‌లో పర్యటించడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సీబీఐ విచారణ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే మథుర ఘర్షణలు జరిగాయని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో విమర్శించారు. దాడికి పాల్పడ్డవారిలో అఖిలేష్ మంత్రి వర్గంలోని శివపాల్ సింగ్ యాదవ్ అనుచరున్నారంటూ యూపీ బీజేపీ ఆరోపించింది. శివపాల్ యాదవ్ రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. -
ఆ అల్లర్ల సూత్రధారి ఖతం అయ్యాడు!
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 24మంది మృతికి కారణమైన అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ కూడా చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ప్రభుత్వ స్థలం ఖాళీ చేయించే విషయంలో గురువారం యాదవ్ అనుచరులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో మథుర జిల్లా ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫర్హా పోలీసు స్టేషన్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ మృతిచెందారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 మంది చనిపోయారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిలో ఈ ఆందోళనకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ కూడా చనిపోయారని పోలీసులు శనివారం ధ్రువీకరించారు. యాదవ్ నేతృత్వంలోని మూడువేల మంది మథురలోని జవహర్ బాగ్ పార్కును ఆక్రమించి రెండేళ్లుగా మకాం వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పార్కును ఖాళీ చేసేందుకు పోలీసులు వెళ్లగా యాదవ్ అనుచరులు ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు-ఆందోళనకారుల మధ్య జరిగిన రణరంగంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆయనను వదిలేసి నా వెంట పడతారేం?: హేమ
మథుర: 'శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోకి వస్తుంది. ఎంపీగా నేను ఆ విషయాల్లో జోక్యం చేసుకోలేను. అల్లరి మూకలను నియంత్రించడంలో విఫలమైన అఖిలేశ్ యాదవ్ ను వదిలి, ప్రతి ఒక్కరూ నా వెంటపడటం హాస్యాస్పదం. మథురలో 10 రోజులు ఉండి, నేను వెళ్లిపోయిన మరునాడే హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఇతర పనులన్నింటిని పక్కకుపెట్టి ఇక్కడికి బయలుదేరా. నిజానికి జవహర్ బాగ్ లోని 260 ఎకరాల పార్కు స్థలంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు నేను పదేపదే విన్నవించాను. కానీ సమస్య పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం చొరవచూపలేదు. పైగా ఆక్రమణదారులకు వత్తాసుపలికారు. వాళ్లు(ఆక్రమణదారులు) అంతంత భారీ ఆయుధాలు సమకూర్చునేంతవరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎంపీగా మథురలో జరుగుతున్న విషయాలపై నాకు అవగాహన ఉంది. ఆక్రమణదారుల పీచమణిచేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నా, అఖిలేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతి ఇవ్వడంలేదు' అంటూ తన నియోజకవర్గంలో చోటుచేసుకున్న అల్లర్లపై స్పందించారు మథుర ఎంపీ, సినీనటి హేమా మాలిని. (చదవండి: రగులుతున్న మథుర) పోలీసులు, ఆక్రమణదారుల మధ్య కాల్పులతో గడిచిన రెండు రోజులుగా మరుభూమిని తలపిస్తోన్న మథురలో ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. హింసాయుత సంఘటనలపై అధికార, విపక్షాలు, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అల్లర్లు అట్టుడుకుతున్నవేళ.. సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హేమా మాలిని శుక్రవారం రాత్రి మథురకు చేరుకున్నారు. ఆక్రమణదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ ముకుల్ ద్వివేది కుటుంబసభ్యులను శనివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోపాటు మీడియాపైనా మండిపడ్డారు. ఆక్రమణదారులను అదుపుచేయడంలో విఫలమైన అఖిలేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం బీజేపీ తలపెట్టిన ర్యాలీకి హేమ మాలిని నేతృత్వం వహిస్తారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జవహర్ బాగ్ లోని పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందిన కార్యకర్తలు దాడి చేయడం, పోలీసులు ప్రతిదాడి చేసిన సంఘటనలో ఎస్పీ, ఎస్ హెచ్ వో సహా 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.