ఆయనను వదిలేసి నా వెంట పడతారేం?: హేమ | Why they are after me? Actress and BJP MP Hema Malini on Mathura voilence | Sakshi
Sakshi News home page

ఆయనను వదిలేసి నా వెంట పడతారేం?: హేమ

Published Sat, Jun 4 2016 2:06 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

ఆయనను వదిలేసి నా వెంట పడతారేం?: హేమ - Sakshi

ఆయనను వదిలేసి నా వెంట పడతారేం?: హేమ

మథుర: 'శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోకి వస్తుంది. ఎంపీగా నేను ఆ విషయాల్లో జోక్యం చేసుకోలేను. అల్లరి మూకలను నియంత్రించడంలో విఫలమైన అఖిలేశ్ యాదవ్ ను వదిలి, ప్రతి ఒక్కరూ నా వెంటపడటం హాస్యాస్పదం. మథురలో 10 రోజులు ఉండి, నేను వెళ్లిపోయిన మరునాడే హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఇతర పనులన్నింటిని పక్కకుపెట్టి ఇక్కడికి బయలుదేరా.

నిజానికి జవహర్ బాగ్ లోని 260 ఎకరాల పార్కు స్థలంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు నేను పదేపదే విన్నవించాను. కానీ సమస్య పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం చొరవచూపలేదు. పైగా ఆక్రమణదారులకు వత్తాసుపలికారు. వాళ్లు(ఆక్రమణదారులు) అంతంత భారీ ఆయుధాలు సమకూర్చునేంతవరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎంపీగా మథురలో జరుగుతున్న విషయాలపై నాకు అవగాహన ఉంది. ఆక్రమణదారుల పీచమణిచేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నా, అఖిలేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతి ఇవ్వడంలేదు' అంటూ తన నియోజకవర్గంలో చోటుచేసుకున్న అల్లర్లపై స్పందించారు మథుర ఎంపీ, సినీనటి హేమా మాలిని. (చదవండి: రగులుతున్న మథుర)

పోలీసులు, ఆక్రమణదారుల మధ్య కాల్పులతో గడిచిన రెండు రోజులుగా మరుభూమిని తలపిస్తోన్న మథురలో ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. హింసాయుత సంఘటనలపై అధికార, విపక్షాలు, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అల్లర్లు అట్టుడుకుతున్నవేళ.. సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హేమా మాలిని శుక్రవారం రాత్రి మథురకు చేరుకున్నారు. ఆక్రమణదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ ముకుల్ ద్వివేది కుటుంబసభ్యులను శనివారం కలుసుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోపాటు మీడియాపైనా మండిపడ్డారు. ఆక్రమణదారులను అదుపుచేయడంలో విఫలమైన అఖిలేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం బీజేపీ తలపెట్టిన ర్యాలీకి హేమ మాలిని నేతృత్వం వహిస్తారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జవహర్ బాగ్ లోని పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందిన కార్యకర్తలు దాడి చేయడం, పోలీసులు ప్రతిదాడి చేసిన సంఘటనలో ఎస్పీ, ఎస్ హెచ్ వో సహా 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement