ఆ అల్లర్ల సూత్రధారి ఖతం అయ్యాడు!
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 24మంది మృతికి కారణమైన అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ కూడా చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ప్రభుత్వ స్థలం ఖాళీ చేయించే విషయంలో గురువారం యాదవ్ అనుచరులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో మథుర జిల్లా ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫర్హా పోలీసు స్టేషన్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ మృతిచెందారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 మంది చనిపోయారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిలో ఈ ఆందోళనకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ కూడా చనిపోయారని పోలీసులు శనివారం ధ్రువీకరించారు.
యాదవ్ నేతృత్వంలోని మూడువేల మంది మథురలోని జవహర్ బాగ్ పార్కును ఆక్రమించి రెండేళ్లుగా మకాం వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పార్కును ఖాళీ చేసేందుకు పోలీసులు వెళ్లగా యాదవ్ అనుచరులు ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు-ఆందోళనకారుల మధ్య జరిగిన రణరంగంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.