లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. తాను యూపీ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని, మోదీ హయాంలో మాత్రం నిత్యం హింస చెలరేగుతోందని ఆరోపించారు. ప్రధాని పదవిలో కొనసాగేందుకు మోదీ ఏమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా వ్యవహరించిన సమయంలో చోటుచేసుకున్న ఘటనలు బీజేపీకి, దేశానికి మాయని మచ్చ వంటివని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం దీటుగా వ్యవహరించిందని, అదే సమయంలో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా, గుజరాత్ సీఎంగా అసమర్ధ వైఖరితో వ్యవహరించారని ఆరోపించారు. మోదీ హయామంతా హింస చెలరేగిందని, ఆయన అత్యున్నత పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని మాయావతి మండిపడ్డారు.
కాషాయపార్టీ అవినీతి నేతలతో నిండిపోయిందని దుయ్యబట్టారు. కాగా, మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా 1995-97 మధ్య తిరిగి 2002-03, 2007-12 వరకూ నాలుగు సార్లు పనిచేశారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల తుదివిడత పోరులో భాగంగా యూపీలోని మిగిలిన 13 స్ధానాలకు ఈనెల 19న పోలింగ్ జరగనుంది. ఏడు దశల పోలింగ్ అనంతరం ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment