భోపాల్ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే వివాదాస్పద చట్టాన్ని సమర్ధించిన పార్టీ ఎమ్మెల్యేను బీఎస్పీ అధినేత్రి మాయావతి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తప్పవని మాయావతి ట్వీట్ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ శనివారం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర చట్టాన్ని సమర్ధించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ సమక్షంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా పౌర చట్టానికి మద్దతు ప్రకటించడం బీఎస్పీ హైకమాండ్‌కు ఆగ్రహం కలిగించింది. పౌర చట్టాన్ని ఆమోదం పొందేలా చాకచక్యంగా వ్యవహరించిన నరేంద్ర మోదీ, ప్రహ్లాద్ పటేల్, అమిత్ షాలను తాను అభినందిస్తున్నాని, ఈ గొప్ప నిర్ణయం చాలా కాలం కిందటే తీసుకోవాల్సి ఉందని రమాభాయ్ వ్యాఖ్యానించారు. గత పాలకులు ఇలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయలేదని అనిపిస్తోందని, తాను తన కుటుంబం ఈ చట్టాన్ని సమర్ధిస్తుందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధినేత్రి ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment