
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లాలో ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సంప్రదాయ వైద్య విధానంతో దేశంలో వైద్య విప్లవం తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు.
గత ముప్పై ఏళ్లుగా మనం ఐటీ విప్లవం చూశామని, ఇప్పుడు సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదతో వైద్య విప్లవానికి సమయం వచ్చిందని, అందువల్ల ఆయుర్వేదను పటిష్టపరచడమే కాక, పునరుద్ధరించేలా మనందరం ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని పేదలకు అతితక్కువ ధరకే.. అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆయుర్వేదను విస్తరించడం తప్పనిసరని, సకల సదుపాయాలతో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఆయూష్ మంత్రిత్వ శాఖ చురుకుగా పనిచేస్తోందన్నారు. మూడేళ్ల కాలంలో దేశంలో 65కు పైగా ఆయుష్ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని తెలిపారు.
భారత సామర్థ్యం.. ఆయుర్వేద..
ఆయుర్వేద అనేది భారతదేశ సామర్థ్యమని, ఈ రంగంలో సేవలందిస్తున్న వారు ఆయుర్వేదను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. అల్లోపతి మాదిరిగానే ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఈ రంగంలోని నిఫుణులు రూపొందించాలని సూచించారు.
మంచి ఆరోగ్యం కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నారని, దీనిని ఆయుర్వేద వినియోగించుకోవాలని చెప్పారు. ఆయుర్వేద ఔషధాలను ఆధునిక పద్ధతుల్లో ప్యాక్ చేసి అందించాలన్నారు. ప్రైవేటు కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో ఆయుర్వేదను పటిష్టం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
ఆయుర్వేద సిలబస్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చాలని, ఆయుర్వేదకు సంబంధించి ప్రతి లెవల్‌ను దాటిన తర్వాత సర్టిఫికెట్లు అందజేయాలని పేర్కొన్నారు. సంప్రదాయ విధానాలను నిర్లక్ష్యం చేసిన దేశాలు తమ అస్థిత్వాన్ని కోల్పోయాయని చెప్పారు. ఔషధ మొక్కలను పెంచేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖ రైతుల్లో చైతన్యం తీసుకురావాలని, దీని వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment