బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
Published Mon, Aug 28 2017 5:09 PM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా సచ్చా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన డేరాకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్న మరోసారి తెర ముందుకు వచ్చింది. బాబాను కోర్టు దోషిగా నిర్ధారించిన రోజున ఆయన వెంట ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన పెంపుడు కూతురు హానీ ప్రీత్ ఇన్సాన్ ప్రయాణించడంతో ఆమెనే ఆయనకు వారసురాలనే ప్రచారం జరిగింది. గుర్మీత్ సింగ్ సొంత కూతుళ్లు అమన్‌ప్రీత్, చరణ్‌ప్రీత్, కుమారుడు జస్మీత్ ఇన్సాన్ కన్నా హానీ ప్రీత్‌కే డేరాలో ఎక్కువ పలుకుబడి ఉండడంతో ఆమెనే డేరా నాయకులవుతారని ఇప్పటికీ డేరా అనుచరులు భావిస్తున్నారు.
ట్విట్టర్‌లో పది లక్షల మంది, ఫేస్‌బుక్‌లో ఐదు లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1,88,000 మంది ఫాలోవర్లను కలిగిన హానీ ప్రీత్ సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. పెంపుడు తండ్రి సింగ్‌ను దైవంగాను, రాజులకు రాజుగాను అస్తమానం అభివర్ణించే హానీ ప్రీత్ తన వెబ్‌సైట్‌లో ఎక్కువగా తండ్రి బోధనల గురించే ప్రచారం చేస్తారు. ఆయన ట్వీట్లను ఎక్కువగా ట్విట్టర్‌లో రీట్వీట్ చేస్తుంటారు. 'ఎంఎస్‌జీ ది వారియర్:లైన్ హార్ట్' సిరీస్ సినిమాలతోపాటు సింగ్ తీసిన అన్ని సినిమాల్లో నటించిన హానీ ప్రీత్ తాను గొప్ప దర్శకులరాలినని, నటినని, ఫిల్మ్ ఎడిటర్‌నని, రచయితనని, అన్నింటికన్నా సింగ్‌కు గొప్ప కూతురునని చెప్పుకుంటారు. ఆమె ఎంఎస్‌జీ సిరీస్ సినిమాల్లో తన తండ్రి పేరుతోపాటు 30 అంశాల్లో తన పేరును క్రెడిట్ లైన్‌గా వేసుకున్నారు.
గుర్నీత్ సింగ్‌కు హానీ ప్రీత్ ఎలా పరిచయం?
హానీ ప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో సచ్చా డేరా ఫాలోవర్ విశ్వాస్ గుప్తా అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాక తన పేరును హానీ ప్రీత్‌గా మార్చుకున్నారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని ఆమె గుర్నీత్‌ను కలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఆయన ఆమెను తన పెంపుడు కూతురుగా దత్తత తీసుకున్నారు. ఆమె భర్త విశ్వాస్ గుప్తాకు ఆశ్రమంలో మంచి స్థానం కల్పించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే హానీ ప్రీత్ భర్తతోని కాపురానికి వెళ్లకుండా తండ్రితోనే ఉండిపోవడంతో తన భార్యను తనకు అప్పగించాల్సిందిగా కోరుతూ 2011లో విశ్వాస్ గుప్తా కోర్టుకు ఎక్కారు. అప్పుడు హానీ ప్రీత్ విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. నిజా నిజాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఇక ముందు బయ
టకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
Advertisement