జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్ ఏమన్నాడంటే..?
జైపూర్: జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన అమన్ బన్సాల్ మొదటి ర్యాంక్ సాధించాడు. 320 మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. కోట ప్రాంతంలో అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ లో అతడు కోచింగ్ తీసుకున్నాడు. ఇదే ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్న కునాయ్ గోయల్ 310 మార్కులతో మూడో ర్యాంక్ లో నిలిచాడు.
ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నట్టు అమన్ బన్సాల్ తెలిపాడు. రెగ్యులర్ స్టడీస్, ఆత్మవిశ్వాసం తన విజయానికి కారణమని వెల్లడించాడు. 'జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం రోజుకు 5 నుంచి 6 గంటల పాటు చదివేవాడిని. తరగతి గదిలో తమకొచ్చిన అనుమానాలను విద్యార్థులు వెంటనే నివృత్తి చేసుకోవాల'ని 17 ఏళ్ల అమన్ అన్నాడు.
అతడి తండ్రి ఇంజనీర్. తల్లి గృహిణి. సబ్జెక్టులోని కీలక అంశాలపై సహచర విద్యార్థులతో చర్చించేవాడినని.. దీంతో అనుమానాలు ఎప్పటికప్పుడు నివృత్తి అయ్యేవని, అవగాహన పెరిగేదని బన్సాల్ వివరించాడు. కోటలో కోచింగ్ తీసుకోవడం కూడా తనకు ఉపయోగపడిందని తెలిపాడు. ఇంటర్ పరీక్షల్లో అతడు 96.2 శాతం మార్కులు సాధించాడు.