
రిపబ్లిక్ డే టెన్షన్: ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్!
ఘజియాబాద్: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ భద్రత చర్యలు తీసుకుంటున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరుగడం కలకలం రేపింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు సమాచారం. ఘటనా స్థలంలో పోలీసులు ఓ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అరెస్టైన అంకిత్ అనే వ్యక్తి ఓ పేరు మెసిన దొంగ. ఘజియాబాద్ రాజ్‌నగర్‌లో చోరీకేసులో అతనిపై పోలీసులు రూ. 25వేల రివార్డ్ ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోనూ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోనూ హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని మెట్రో నగరాలు లక్ష్యంగా దాడులు చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడుల నిరోధానికి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.