జీవితమే వలస.. | migratory animals | Sakshi
Sakshi News home page

జీవితమే వలస..

Published Fri, Feb 12 2016 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

migratory animals

మనలో చాలా మందికి ప్రయాణం అంటే ఇష్టం. కాస్త ఖాళీ దొరికినా ప్రయాణాలు చేస్తూ ప్రపంచాన్ని చూసేవాళ్లు కోకొల్లలు. మనం జీవితంలో ప్రయాణాన్ని ఒక భాగంగా చూస్తే, కొన్ని రకాల జీవులు మాత్రం ప్రయాణాలే జీవితంగా బతికేస్తుంటాయి. కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకుని మనుగడ సాగించాలంటే కొన్ని జీవులకు వలసే మార్గం. తమ ఉనికిని కాపాడుకునేందుకు అవి వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. అలా వలస వెళ్లే జీవుల్లో టాప్-10 జీవులను గుర్తించారు శాస్త్రవేత్తలు. వాటి వైపు ఓ లుక్కేద్దాం రండి..!
 
 వైల్డ్ బీస్ట్
జింకల జాతికి చెందిన వైల్డ్ బీస్ట్‌లు వలస వెళ్లే సమయంలో చాలా ధైర్యంతో ఉంటాయి. వీటి వలసకి నిర్దిష్ట సమయం ఉండదు. ఇవి ఒక్కోసారి జీబ్రాలను కూడా తమతో తీసుకెళ్తాయి. పచ్చదనం ఎక్కడుంటే అక్కడికి ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇతర జంతువుల భాషని అర్థం చేసుకోగలగడం వీటికున్న మరో ప్రత్యేక లక్షణం. ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో కనబడతాయి. చిత్రమేమిటంటే వీటి సంఖ్య ఏ ప్రాంతంలో తగ్గితే అక్కడ రాబందులు సంఖ్య కూడా తగ్గుతుంది.
 
 ఇసుక కొంగలు
ఇవి ఈశాన్య సైబీరియా నుంచి అమెరికాలోని మధ్య పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాయి. లక్షలకొద్దీ పక్షులు గుంపులుగా ప్రయాణిస్తాయి. మెక్సికో, అరిజోనాలో లోతైన గుంటలు తవ్వి వెచ్చగా ఉండేలా చూసుకుని అందులో విశ్రమిస్తాయి.
 
 ఆర్కిటిక్ టెర్న్స్
ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో కనిపించే ఈ పక్షులు ప్రయాణాన్ని ఆస్వాదిస్తాయి. ఉత్తర ధ్రువంలో శీతాకాలం అంటే ఆ సమయంలో దక్షిణ ధ్రువంలో వేసవికాలం అన్నమాట. ఇవి ప్రతి ధ్రువంలో ఎండాకాలం ఉండి చలికాలం ప్రారంభమవగానే ఇంకో ధ్రువానికి వెళ్లిపోతాయి. ఇలా ప్రతి ఏటా ఇవి సుమారు 64,300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వీటి జీవిత కాలం 30 సంవత్సరాలు. అంటే ఇవి మొత్తం జీవితంలో సుమారు 20 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయన్న మాట. ఇవి తమ జీవితంలో అధిక భాగం ఎగురుతూనే గడుపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు
 
 ఆర్మీ చీమలు
అన్ని రకాల జీవులు వలస పోతుంటే తామేమీ తక్కువ తినలేదంటూ ఇవి కూడా వలస వెళ్తాయి. ఆర్మీ చీమల్లోనే 200 రకాల జాతులు ఉండటం విశేషం. ఇవి ప్రత్యేకంగా నివాసాలు ఏర్పరచుకోవు. సైన్యంలా ఓ నిర్దిష్టమైన ఆకారంలో ఏర్పడి అలాగే ఉండిపోతాయి. ఇవి తమ బలమైన దవడలతో పెద్ద సైజు సాలెపురుగులను సైతం ముక్కలుగా చేయగలవు.
 
 టూనా చేపలు
రెస్టారెంట్లలో ఎక్కువగా వినిపించే ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఆహార అవసరాల కోసం ఈ చేపను వేటాడతారు. ఇవి ఎక్కువగా వలస వెళ్తుంటాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో అన్ని దేశాల వారు వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. వీటి సంఖ్య ఎక్కువైతే వినాశనం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
 మోనార్క్ సీతాకోక చిలుకలు
పేరుకు తగ్గట్టే వీటిని ప్రయాణంలో ఇతర జాతి సీతాకోక చిలుకల కంటే రాజులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి సంవత్సరానికి 8,000 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి మరి. అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు చలికాలం మొదలవగానే మెక్సికోకు వలసపోతాయి. మళ్లీ అక్కడ శీతాకాలం మొదలైనపుడు తిరుగుముఖం పడతాయి.
 
 సాల్మన్ చేపలు
సముద్రాల్లో కనిపించే ఈ చేపల వలసలు నాటకీయంగా ఉంటాయి. ఇవి సముద్రాల్లోంచి స్వచ్ఛమైన నీరుండే నదుల్లోకి వెళ్తాయి. అక్కడ తమకు అపాయకరంగా అనిపించిన జంతువులను చంపేస్తాయి. ఉవ్వెత్తున ఎగిసే నీటిపై గాల్లోకి లేవడం వీటికి చాలా ఇష్టం. వందలాది చేపలు గుంపులుగా కలిసుంటాయి. 
 
 నీటి ఏనుగు (వాల్స్)
 ఇవి ఎక్కువగా పసిఫిక్ మహా సముద్రంలో కనిపిస్తాయి. ఈ జీవులు శీతాకాలంలో మంచులోనూ, వేసవికాలంలో రాతి ఉపరితలంపై నివసిస్తాయి. ఇవి అలాస్కా దగ్గర పసిఫిక్‌ను ఆనుకున్న బెరింగ్ సముద్రం నుంచి రష్యా దగ్గర ఉన్న చుక్‌చీ సముద్రం వరకు ప్రయాణిస్తాయి. వీటిలో మగవాటి కంటే ఆడ జీవులు, చిన్నవి ప్రయాణంలో చురుకుగా ఉంటాయి.
 
 ఫ్లయింగ్ ఫాక్సెస్
 గబ్బిలం జాతికి చెందిన ఈ జీవిని తెలుగులో చీకురాయి అంటారు. ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే కాలంలో ఇవి శీతల ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఫ్లయింగ్ ఫాక్సెస్ ఆహారంకోసం తేనెటీగల్లా పూలలోని మకరందంపై ఆధారపడతాయి. అడవులు, వ్యవసాయం తగ్గిపోవడంతో ప్రస్తుతం వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొయిలా పక్షుల్లా ఇవి కూడా యూకలిప్టస్ చెట్లపై నివసిస్తాయి.
 
 బూడిద రంగు తిమింగలాలు
తిమింగలాల్లో ఏ జాతివైనా వలస జీవులే. కానీ వీటికి పిల్లల్ని కనడానికి స్థిరంగా ఉండే నీరు, ఆహారం కోసం చల్లటి నీరు అవసరం. ఈ తిమింగలాలు దాదాపు అంతరించిపోయాయి అనుకున్న సమయంలో ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో తిరిగి కనిపించాయి. ప్రతి సంవత్సరం ఈ తిమింగలాలు చుక్‌చీ సముద్రం నుంచి మెక్సికన్ సముద్రానికి వలస వెళ్తాయి. ఈ ప్రయాణానికి వాటికి 3-4 నెలల సమయం పడుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement