
పాలు లీటరు రూ.200కు విక్రయం
కేకే.నగర్ : ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. జిల్లాల్లో సామాన్యుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. కొన్ని చోట్ల దుకాణాలు మూసివేసి సంతాపం ప్రకటించగా ఇదే అదునుగా పలువురు వ్యాపారులు అందిన కాడికి దోచేసుకుంటున్నారు. రెండు రోజుల పాటు పాల సరఫరా నిలిపివేశారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు పాల ధరను అమాంతం పెంచారు. లీటరు పాల ధర రూ.200లకు విక్రయించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై తమిళనాడు పాల ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు.
కొంతమంది వ్యాపారస్తులు పాల ఏజెంట్ల నుంచి తమ ఇంట్లో శుభకార్యాల కోసం అని చెప్పి పాల ప్యాకెట్లను అధికంగా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పాల సరఫరా నిలిపి వేశారని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి లీటరు పాలను రూ.200లకు విక్రయిస్తున్నట్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా తమకు ఫిర్యాదులు అందాయన్నారు. నార్త్ చెన్నై ప్రాంతంలో ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు పాల సంస్థ కంటైనర్ లారీని కొందరు ఆగంతకులు అడ్డుకుని పాల ప్యాకెట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాల సంఘాలు ప్రకటించాయి. తప్పుడు వదంతులను నమ్మి ప్రజలు పాల ప్యాకెట్లను అధిక ధరలకు కొనుగోలు చేయకూడదని, అధిక ధరలకు విక్రయిస్తున్న వారిని పోలీసులకు అప్పగించాలని కోరారు. పాల ఏజెంట్ల దుకాణాలకు, వాహనాలకు రాష్ట్ర పోలీసుశాఖ భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.