న్యూఢిల్లీ: మాజీ ఒలింపియన్ ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కాసింగ్ పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. వైద్యురాలిగా తన కుమార్తె అందిస్తున్న సేవలను చూసి తండ్రిగా గర్వపడుతూనే.. కన్నబిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. కరోనా విలయ తాండవం చేస్తున్న అమెరికాలోని న్యూయార్క్‌లో ఆయన కుమార్తె మోనా మిల్కా సింగ్ వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
‘మా అమ్మాయి మోనా మిల్కా సింగ్ న్యూయార్క్‌లో డాక్టర్‌గా పనిచేస్తోంది. కరోనా బాధితులకు ఆమె సేవలు అందిస్తుండటం చూసి మేమంతా గర్వపడుతున్నాం. ప్రతి రోజు మాతో ఫోన్‌లో మాట్లాడుతుంది. మా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతూ ఉంటుంది. కోవిడ్-19 విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యం గురించి కంగారు పడుతున్నామ’ని మిల్కా సింగ్ చెప్పారు. అయితే తన కుమార్తె ఎలాంటి భయాలు లేకుండా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తోందన్నారు.
కాగా, కరోనాపై పోరులో వైద్య సిబ్బంది ముందండి పోరాడుతున్నారు. కరోనా సోకి అమెరికాలో 45 వేల మందిపైగా చనిపోగా, వీరిలో దాదాపు సగం మంది న్యూయార్క్ రాష్ట్రానికి చెందినే వారే కావడం గమనార్హం. అమెరికాలో 8 లక్షల మందిపైగా కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇది చదవండి: వరుస దాడులా.. సిగ్గుచేటు
Comments
Please login to add a commentAdd a comment