
పాండురంగా పాహిమాం
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని, ప్రజలు నిత్యం సుఖఃసంతోషాలతో ఉండేలా వర్షాలు కురిపించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విఠల-రుక్మిణి దంపతులను వేడుకున్నారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం వేకువజామున మూడు గంటలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా పండరీపూర్‌లోని విఠల-రుక్మిణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుణుడు నెల రోజులు ఆలస్యంగా కరుణించడంతో రాష్ర్టంలోని రైతాంగం నిరాశకు లోనయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకుసాగుతున్నదని అన్నారు. విఠలుడి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున, వారికి తగిన సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇక్కడి మఠాలు, ధర్మశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు భారీగా నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
షోలాపూర్ పట్టణవ్యాప్తంగా రూ.81 కోట్ల వ్యయంతో సులభ్ మరుగుదొడ్ల కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని ప్రకటించారు. భీమనది తీరంలోని గోపాల్‌పూర్ వద్ద స్నానపు గదులు నిర్మించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సంత్ నామ్‌దేవ్ స్మారకం నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు. పల్లకీ యాత్రలు సాగే దేహూ, ఆలంది, బండారా, డోంగారు, నెవాసా తదితర ప్రాంతాలు, రోడ్ల అభివృద్ధికి రూ.143 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు రూపొందించామన్నారు. పల్లకీయాత్ర సందర్భంగా మరణించిన, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
కిక్కిరిసిన భక్తజనం...
లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల ‘పాండురంగ విఠల విఠల’ నామస్మరణతో పండరీపూర్ పులకించిపోయింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న విఠల-రుక్మిణి ఆలయం సమీపంలోని చంద్రబాగా నదీతీరం వెంబడి వార్కారీలు, భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి పల్లకీలు, కాలినడకన, వాహనాల ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకొని చంద్రబాగా నదిలో స్నానాలు ఆచరించారు.
విఠల రుక్మిణిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ తీర్థయాత్రలో పాల్గొనేందుకు రాష్ర్టం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎదురవడంతో ఎనిమిది లక్షల మంది మాత్రమే వచ్చారు. ప్రతి ఏటా 10 నుంచి 12 లక్షల మంది ఈ యాత్రకు వస్తుంటారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక రథాన్ని అలంకరించి అందులో ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు విఠలుడికి ఎండు ఖర్జూరాలు, బాదం పప్పు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ముఖ్యమంత్రికి సన్మానం...
పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయ కమిటీ తరఫున అధ్యక్షుడు అన్నాసాహెబ్ డాంగె,
పాలకవర్గ సభ్యులు.. ముఖ్యమంత్రి దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి దంపతులతోపాటు ఈ పూజలో పాల్గొనేందుకు కర్ణాటక బీదర్ జిల్లా వాసులైన శేలుకే రాము, ప్రమీల దంపతులకు అదృష్టం దక్కింది.
మూడుతరాలుగా తమ కుటుంబీకులు వార్కారీలుగా ప్రతి ఏటా పండరీపూర్‌కు వస్తున్నట్లు రాము తెలిపారు. ముఖ్యమంత్రి ఈ దంపతులను సన్మానించారు. జీవితాంతం ఉచితంగా ఎంఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా పాస్‌లను అందజేశారు.