
నాకు పెళ్లి ఇష్టంలేదు.. ప్లీజ్ ఆపండి
గుజరాత్ రాజధాని గాంధీనగర్కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొలవడ అనే గ్రామం ఉంది. ఆ ఊరి నుంచి శనివారం 17 ఏళ్ల అమ్మాయి 181 అభయం హెల్ప్లైన్కు ఫోన్ చేసింది.
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని గాంధీనగర్కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొలవడ అనే గ్రామం ఉంది. ఆ ఊరి నుంచి శనివారం 17 ఏళ్ల అమ్మాయి 181 అభయం హెల్ప్లైన్కు ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి నిశ్చయించారని, ఈ నెల 18న పెళ్లిముహూర్తం ఖరారు చేశారని, తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి ఇష్టం లేదని, పెళ్లిని ఆపించి తనకు సాయం చేయాల్సిందిగా ఆ అమ్మాయి వేడుకోంది.
అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. తనకు ఇష్టంలేదని ఆమె ఎంత చెప్పినా ఎవరూ ఆమె మాట వినే పరిస్థితి లేదు. దీంతో ఆమె ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులతో కలసి ఉండేందుకు ఇష్టంలేదని చెప్పింది. 181అధికారులు, మహిళా పోలీసులతో కలసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. వీరు రాగానే కుటుంబ సభ్యులు మాటమార్చేశారు. ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. అధికారులు పెళ్లి ఆహ్వాన పత్రికలను గుర్తించారు. ఆ అమ్మాయి తన ఆవేదనను అధికారులకు చెప్పింది. పదో తరగతిలో 88.11 శాతం మార్కులు వచ్చాయి. కాలేజీకి వెళ్లి చదువుకోవాలని ఆశించింది. అయితే ఇంట్లో వాళ్లు చదువు మాన్పించారు. అయినా ఆ అమ్మాయి సొంతంగా చదువుకుంటూ ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇంతలో ఇంట్లో వాళ్లు పెళ్లి నిశ్చయించారు.
181 అధికారులు, మహిళ పోలీసులు.. ఆ అమ్మాయి పెళ్లిని అడ్డుకున్నారు. బాల్యవివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. మహిళ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని అమ్మాయికి సూచించగా, తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటానని చెప్పింది. చివరకు అమ్మాయి కుటుంబ సభ్యులు దిగివచ్చారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం పెట్టబోమని అమ్మాయి తల్లిదండ్రులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆమె ఇష్టప్రకారం చదువుకునేందుకు అంగీకరించారు. దీంతో ఆ అమ్మాయి వ్యథ సుఖాంతమైంది.