జయలలితకు బదులు స్టాలిన్ అధ్యక్షత!
కావేరీ అంశంపై చర్చించడానికి తమిళనాడులో మంగళవారం ఓ అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతతో నెలరోజులకు పైగా ఆస్పత్రిలో ఉండటంతో.. ఆ సమావేశానికి ప్రతిపక్షానికి చెందిన ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించారు. తన బలాన్ని నిరూపించుకోడానికి, కరుణానిధి తర్వాత కూడా పార్టీని సమర్థంగా నడిపించగలనని చూపించడానికే స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు ఇలా సమావేశాలు పెట్టడం ఎందుకని దీనిపై ఎండీఎంకే నాయకుడు వైగో ప్రశ్నించారు. సీనియర్ నాయకుడు జీకే వాసన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు ఉన్న వాసన్.. తర్వాత 2014లో బయటకు వచ్చి తమిళ మానిల కాంగ్రెస్ పెట్టిన విషయం తెలిసిందే.
కావేరి అంశంపై తమిళనాడు పార్టీలన్నింటిదీ ఒకటే మాట అని నిరూపించుకోడానికే ఈ సమావేశాన్ని పెట్టినట్లు స్టాలిన్ చెప్పారు. మరే ఇతర పార్టీ సమావేశం ఏర్పాటుచేసినా డీఎంకే కూడా పాల్గొనేదని తెలిపారు. డెల్టా రైతులకు ఎకరాకు రూ. 30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. అన్ని పార్టీల నుంచి సభ్యుల బృందం ఒకటి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు. ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యాయి. ఇది రాజకీయ డ్రామా అని మండిపడ్డాయి. కానీ ఈ విమర్శే చేసిన వైగో దాదాపు 18 ఏళ్ల పాటు డీఎంకే ఎంపీగా ఉండేవారని.. దీని ప్రాముఖ్యం ఏంటో ఆయనకు తెలుసని స్టాలిన్ అన్నారు. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావేరీ జలాల ట్రిబ్యూన్‌ను ఏర్పాటుచేయడంలో కరుణానిధి పోషించిన పాత్రను బీజేపీ నాయకులు తెలుసుకోవాలని పొన్ రాధాకృష్ణన్ విమర్శలపై స్పందిస్తూ చెప్పారు. పలువురు రైతుసంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.