న్యూఢిల్లీ : ఆ రోజు మా అమ్మ నా చేత లంచం తీసుకోనని ప్రమాణం చేయించింది.. అందువల్లే నేను ఈ రోజు ఇంత స్వచ్ఛంగా ఉన్నాను అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు విషయాల గురించి మాట్లాడారు. ‘మా అమ్మ దృష్టిలో ప్రధాని పదవి కన్నా గుజరాత్ సీఎం పదవే చాలా విలువైనది. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు నేను ఆమెకు దగ్గరగా ఉండేవాడిని కదా అందుకే సీఎం పదవంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం’ అని తెలిపారు.
అంతేకాక ‘నన్ను తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రకటించిన సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ప్రమాణస్వీకారానికి ముందు నేను మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవడానికి అహ్మదాబాద్ వెళ్లాను. అప్పుడు మా అమ్మ నా సోదరుని దగ్గర ఉండేది. నేను వెళ్లేసరికే అక్కడ సంబరాలు ప్రారంభమయ్యాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని కాబోతున్నానని మా అమ్మకు కూడా తెలిసింది. అయితే ఆ పదవి బాధ్యతలు ఎలా ఉంటాయనే విషయం మా అమ్మకు తెలియదు. నేను వెళ్లగానే మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని.. పోనిలే ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు. నాకదే చాలు అంది’ అని గుర్తు చేసుకున్నారు.
అప్పుడు మా అమ్మ ‘నీ ఉద్యోగం ఏంటో నాకు తెలియదు. కానీ జీవితంలో లంచం తీసుకోను అని నాకు మాటివ్వు అన్నారు. ఆ రోజు మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నా జీవితంలో లంచం తీసుకునే పాపం చేయ్యలేదు. ఫలితంగా ఈ రోజు ఇంత స్వచ్ఛంగా ఉన్నాన’ని తెలిపారు. అంతేకాక ‘సీఎం, పీఎం అన్నది అమ్మకు ముఖ్యం కాదు. ఆ సీటులో కూర్చున్న వారు ఎవరైనా సరే నిజాయితీగా ఉండాలి.. దేశం కోసం పాటుపడాలి అనేదే ఆమె సిద్దాంతం’ అంటూ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు పనిచేశారు. 2014లో బీజేపీ తరఫున ప్రధాని అయ్యారు
Comments
Please login to add a commentAdd a comment