సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూర్పు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. సీలంపూర్, జామియా, షహీన్‌బాగ్ ఇలా రోజుల తరబడి జరుగుతున్న పౌర నిరసనలు కాకతాళీయంగా జరిగేవి కాదని, దీని వెనుక కుట్ర ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశాన్ని చీల్చే కుట్రతోనే రాజకీయ శక్తులు దుష్ట పన్నాగాలకు పాల్పడుతున్నాయని అన్నారు. విద్వేష రాజకీయాలతో దేశం ముందుకెళ్లదని, అభివృద్ధి విధానంతోనే దేశ రూపురేఖలు మారతాయని బీజేపీ విశ్వసిస్తోందన్నారు.
తమ పార్టీకి దేశ ప్రయోజనాలే ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. 2022 నాటికి పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఆప్‌ను మరోసారి గెలిపిస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందని హెచ్చరించారు. అనధికార కాలనీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అక్కడి ప్రజలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతోందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం, పౌరసవరణ చట్టం అంశాలను ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment