సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరగుతున్న ఎన్నికల వేడి బయటకు అంతగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈసారి అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలుస్తుందా? అన్న విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకుగాను అరవింద్ కేజ్రివాల్ నేతత్వంలో ఆప్ 67 సీట్లతో అఖండ విజయం సృష్టించగా, ఆ తర్వాత 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.
ఇక ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 56 శాతం ఓట్లతో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడవడంతో బీజేపీ గెలుస్తుందని అంచనాలు వేసిన వారు లేకపోలేదు. అయితే జనవరిలో ‘సీ ఓటరు’ విడుదల చేసిన ముందస్తు ఎన్నికల సర్వే ప్రకారం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 53 శాతం ఓట్లు, బీజేపీకి 29 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి నాలుగు శాతం కన్నా తక్కువ సీట్లు వస్తాయని తేలింది. సీట్ల సంఖ్యను మాత్రం ఆ సర్వే వెల్లడించలేదు. తాజాగా విడుదలైన ‘న్యూస్‌ఎక్స్-పోల్‌స్ట్రాట్’ ముందస్తు ఎన్నికల సర్వే ప్రకారం ఆప్‌నకు 48.56 శాతం ఓట్లతో 53 నుంచి 56 అసెంబ్లీ సీట్లు, బీజేపీకి 31.7 శాతం ఓట్లతో 12-15 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 9.64 శాతం ఓట్లతో రెండు నుంచి నాలుగు సీట్లు లభిస్తాయి. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!)
ఈ అంచనాలు నిజమేనా?
ఈ ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ ప్రభావాన్ని తట్టుకొని అరవింద్ కేజ్రివాల్ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకరాగలరా? అదే నిజమైతే అందుకు దోహదపడే అంశాలేమిటీ? 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో పోటీ చేసిన కేజ్రివాల్, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి దెబ్బతిన్నారు. అప్పటి వరకు పోరాటమే తన తత్వమంటూ చెప్పుకున్న కేజ్రివాల్, బీజేపీ సానుభూతిపరులను కూడా తనవైపు తిప్పుకోవాలన్న తలంపుతో అభివృద్ధి మంత్రంతో పెద్దన్న పాత్రను పోషించడం ప్రారంభించారు. (రాజధాని రంగస్థలం)
ఇందులో భాగంగా విద్యుత్, నీళ్లు, విద్య, ఆరోగ్యం అనే నాలుగు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ఎజెండా అందుకున్నారు. నగరంలో విద్యుత్, నీళ్లు సరఫరాను బాగా మెరగుపర్చారు. పేదలకు సబ్సిడీలను పెంచారు. విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించారు. ప్రభుత్వ విద్యా విధానంలో ఢిల్లీ మోడల్‌ను తాము కూడా ప్రవేశపెడతామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ఢిల్లీ నగరంలో ఆప్ అమలు చేస్తున్న ‘మొహల్లా క్లినిక్ మోడల్’ అద్భుతమంటూ పలు స్వతంత్య్ర సంస్థలు ప్రశంసించడం ఇందుకు తార్కాణం. కేజ్రివాల్ ప్రభుత్వం పనితీరు బాగుందని 86 శాతం మంది అంగీకరించినట్లు ‘రిలబుల్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ 2019, డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో వెల్లడవడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రధాన అంశం.
అదే విధంగా కాంగ్రెస్-బీజేపీలపై విమర్శల జోలికి వెళ్లకుండా ప్రధానంగా అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్న కేజ్రివాల్‌కు సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా నోరు విప్పక తప్పలేదు. దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా ?, ఏదైనా ఎంతుంటుంది ? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం స్పష్టత లభించడం లేదు. ఈ అంశాన్ని పక్కన పెడితే ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment