న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు అత్యాచార బెదిరింపులకు తెగబడుతున్నారని ఆరోపిస్తూ వారి తీరును నిందిస్తూ, తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ సుమారు 175 మంది మహిళా ఉద్యమకారులు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టంతోపాటు, ఎన్‌పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమిస్తున్న మహిళలపై హింసకు పాల్పడాల్సిందిగా బీజేపీ నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, తద్వారా ఎన్నికల్లో ఒక హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆప్ ఇండియన్ విమెన్ సంస్థలతోపాటు ఆర్థికవేత్త దేవకీ జైన్, ఉద్యమకారణి లైలా త్యాబ్జీ, మధు బాధురీ (విశ్రాంత దౌత్యవేత్త), కమలా భాసిన్ తదితరులు ఆ లేఖలో ఆరోపించారు.
ఢిల్లీ మహిళలకు ప్రధాని ఇస్తున్న ఎన్నికల సందేశం ఇదేనా? బీజేపీ ఇంతటి అధమ స్థితికి దిగజారిపోయిందా? అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎంపీ పర్వేశ్ వర్మ తమ అనుచరులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులు చేయించి ఢిల్లీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హింసాకాండతో ఎన్నికల్లో గెలవలేరని హెచ్చరించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. (చదవండి: ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ సర్కార్ కాదు)
Comments
Please login to add a commentAdd a comment