
ఆస్ట్రేలియా వీసాలపై మోదీ ఆందోళన
టర్న్‌బుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని
న్యూఢిల్లీ: అధికశాతం భారతీయులు వినియోగిస్తున్న ఆస్ట్రేలియన్ వర్క్ వీసాలో మార్పులతో నెలకొన్న ఆందోళనల్ని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని పీఎంఓ కార్యాలయం పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణల్లో ఈ అంశంపై చర్చ సాగిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ విషయంలో ఇరు దేశాల అధికారులు చర్చలు కొనసాగించేలా మోదీ, టర్న్‌బుల్‌లు అంగీకారానికి వచ్చారని పీఎంఓ తెలిపింది. అలాగే ఇటీవలి భారత పర్యటన విజయవంతంగా సాగినందుకు ప్రధాని మోదీకి టర్న్‌బుల్ అభినందనలు తెలిపారని, పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల పురోగతిపై ఇరు నేతలు చర్చించారని ప్రకటనలో పేర్కొంది.
జీఎస్టీ, నల్లధనం ఏరివేతపై ప్రధాని సమీక్ష
జీఎస్టీ అమలుతో పాటు నల్లధనం అరికట్టేందుకు ఆర్థిక శాఖ చేపట్టిన చర్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమీక్షించారు. జీఎస్టీ సన్నద్ధతపై రెవెన్యూ అధికారులతో ప్రధాని చర్చించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం స్వచ్ఛందంగా వెల్లడించిన నల్లధనం వివరాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
నల్లధనం పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీ పురోగతిపై సమీక్ష జరిపారు. స్వచ్ఛందంగా వెల్లడించిన నల్లధన వివరాలతో పాటు ఇంతవరకూ వసూలైన పన్ను వివరాల్ని కూడా రెవెన్యూ విభాగం ప్రధానికి తెలిపినట్లు సమాచారం. భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.