నెలాఖర్లో కేరళకు రుతుపవనాలు
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో దేశానికి చల్లని కబురందించారు. రుతుపవనాలు మే చివర్లో లేదా జూన్ మొదట్లో కేరళకు చేరనున్నాయని చెప్పారు. భారత వాతావరణ విభాగం సహా అనేక వాతావరణ సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయన్నారు. అధికారిక ప్రకటన మే 15న వెలువడే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదవుతుందని అంచానా వేస్తున్నారు. ఈ ఏడాది 5 శాతం అటుఇటుగా 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు చెప్తున్నాయి. మే 31కి నాలుగు రోజులు అటుఇటుగా రుతుపవనాలు దక్షిణ కేరళను తాకుతాయని హర్షవర్ధన్ వివరించారు.
ఎండల నుంచి ఉపశమనం: మండుతున్న ఎండల నుంచి కొంత ఉపశమనం కలిగేలా దేశవ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో వానలు పడ్డాయి. హిమాచల్‌లోని దిగువ కొండల్లోని అడవుల్లో వర్షం పడటంతో కార్చిచ్చు నియంత్రణలోకి వచ్చింది. దావానలాన్ని ఆర్పేందుకు వర్షం దోహదపడిందని అధికారులు చెప్పారు. గుజరాత్‌లో వాతావరణం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రత 2 డిగ్రీలు తక్కువగా నమోదైంది. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోని బండాలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బిహార్‌లోని పునియాలో అత్యధికంగా 37.5 మి.మీ, పట్నాలో 10 మి.మీ. వర్షం కురిసింది. మహారాష్ట్ర, తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.