కన్నకూతురి కోసం అద్దెతల్లిగా..
చెన్నై: కన్నకూతురుకి మాతృత్వపు మధురిమ పంచివ్వాలని నిర్ణయించిన ఓతల్లి అద్దె తల్లిగా మారిన ఘటన చెన్నైలో జరిగింది. టీనగర్‌కు చెందిన 28 ఏళ్ల యువతి గర్భవతిగా ఉన్న ఏడో నెలలో ప్లాసండల్ అబ్రప్షన్ వ్యాధికి గురైంది. వైద్యులు ఎంత ప్రయత్నించినా నయం కాకపోవడంతో గర్భంలోనే చనిపోయిన బిడ్డతో సహా గర్భసంచిని తొలగించారు. ఇక తనకు తల్లయ్యే భాగ్యం లేదని కుమార్తె కుమిలిపోతుండగా వైద్యులు సరోగసీ విధానాన్ని సూచించారు. కుమార్తెను తల్లిగా చూడడం కోసం తానే అద్దె తల్లిగా మారేందుకు సిద్ధమని 61 ఏళ్ల వృద్ధురాలు ముందుకు వచ్చింది. సరోగసీ విధానం ద్వారా నవ మాసాలు మోసి గత ఏడాది నవంబర్ 2వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సరోగసీ చికిత్సలు ఎన్నో చేశామని, అయితే కన్నతల్లే అద్దె తల్లిగా మారడం అరుదైన ఘటన అని చికిత్సచేసిన ఆకాశ్ ఫెర్టిలిటీ క్లినిక్ వైద్యులు కామరాజ్, జయరాణీ కామరాజ్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. దేశంలో ఇది రెండో కేసని, తొలి కేసు గుజరాత్‌లో జరిగిందని తెలిపారు.