
అందరికీ ‘అమ్మ’గా...
సాక్షి, చెన్నై: ప్రజల మనసెరిగిన అమ్మగా సంక్షేమ పథకాలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తా...! అన్న నినాదంతో తమిళ సీఎం జయలలిత ముందుకు సాగారు. అందుకే 2011 ఎన్నికల్లో ఉచిత పథకాల మంత్రంతో మన్నలను అందుకున్నారు. జయ రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ ఎప్పుడూ అనే ‘ఎన్ రత్తత్తిన్ రత్తమే(నా రక్తంలో రక్తంగా) అనే మాటలతో తన ప్రసంగాలను ప్రారంభించి జయ జయ ధ్వనాలు అందుకునేవారు. అలాగే జయలలిత సైతం 2016 ఎన్నికల్లో ‘ప్రజల కోసమే అమ్మ, అమ్మ కోసమే ప్రజలు’ అనే నినాదంతో ముందుకు సాగి అపూర్వమైన ఫలితాలతో దశాబ్దాల చరిత్రను తిరగరాశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏ మేరకు ప్రతిష్టను పెంచుకున్నారో, అదే స్థారుులో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నారు. అవినీతి కేసుల్లో జైలు శిక్షను ఎదుర్కొన్న మహిళా సీఎంగా అపఖ్యాతి పొందారు.
సంక్షేమ పథకాల విస్తృతం
తమిళనాట అందరి నోట అమ్మగా పిలిపించుకునే జయలలిత రా ష్ట్ర ప్రజలందర్నీ బిడ్డలుగా భావిస్తారు. తొలి సారి సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం(1991-1996) ‘తొట్టిల్ కుళందై’(ఉయ్యాల బేబి) పేరున శిశు సంరక్షణ పథకంతో శ్రీకారం చుట్టారు. మహిళల భద్రతను కాంక్షిస్తూ, మహిళా పోలీసు స్టేషన్లను నెలకొల్పిన ఘనత అమ్మదే. రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉన్న సేతు సముద్రంను వ్యతిరేకించినా, జాలర్ల సంక్షేమం లక్ష్యంగా కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం గళం విప్పిన వీరనాయకీ. శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చదీవులను భారత్ తిరిగి సొంతం చేసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమె ఆమోదింపజేశారు. గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ఓ మచ్చుక మాత్రమే.
అమ్మ పథకాలు దేశానికే ఆదర్శం
2011లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకారం చుట్టిన బృహత్తర ‘అమ్మ’ పథకాలు తమిళ ప్రజలకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారుు. ఇందులో పేదల కడుపు నింపడం లక్ష్యంగా చౌక ధరకే ఆహారం నినాదంతో నెలకొల్పిన ‘అమ్మ ఉనవగం’(అమ్మ క్యాంటిన్) అనేక రాష్ట్రాలు తామూ సైతం అంటూ ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం కావడం విశేషం. ప్రజల్ని ఏ క్షణాన ఎలా ఆదుకోవాలో తెలిసిన రాజకీయ నేర్పరి. అందుకే అన్ని అమ్మ పథకాలన్నీ ఆదరణ పొందారుు. పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ‘తోట పచ్చదనం, కో ఆపరేటివ్ సొసైటీ దుకాణాల’తో చౌక ధరకే అన్నింటినీ అందించి పేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన ఆర్థిక భారం పడకుండా చేసి అందర్నీ ఆకర్షించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తదుపరి అమ్మ పథకాల పర్వం వేగం పెరగడం విశేషం. అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఫార్మసీలు ఇప్పటికే జనాదరణ పొందారుు. అమ్మ వార సంతలు, అమ్మ థియేటర్లు, ‘అమ్మ కల్యాణ మండపాలు’ ప్రజలకు చేరువకావాల్సి ఉంది. ఇక, నిర్విరామంగా ఉచిత బియ్యం పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం దిగ్విజయవంతమైన అమ్మ పరిపాలనా దీక్షాదక్షతలకు ప్రతీక.
యువతుల పెళ్లి పెద్ద అమ్మే
శిశు మరణాల కట్టడి లక్ష్యంగా, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లక్ష్యంగా ముందుకు సాగి, యుక్త వయస్సు వచ్చిన పేద యువతుల పెళ్లి ఖర్చులకు తాను ఉన్నానని చాటుతూ ప్రవేశ పెట్టిన పథకం ‘తాళికి బంగారం’. లక్షలాది మంది యువతులకు 2011 నుంచి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. తాళి బొట్టుకు నాలుగు గ్రాముల బంగారం ఇవ్వడమే కాకుండా, పెళ్లి ఖర్చులకు రూ. 25 వేలు ఇచ్చిన ఘనత అమ్మదే. తాజాగా మళ్లీ అధికారంలోకి రాగానే, నాలుగు గ్రాముల బంగారం ఎనిమిది గ్రాములకు పెంచిన పెళ్లి పెద్ద అమ్మే.
అన్నదానం.. భక్తి భావం..
అమ్మకు భక్తి భావం ఎక్కువే. అందుకే రాష్ట్రంలోని ఆలయాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చారు. 35 వేల ఆలయాలను ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకొచ్చి, నిధులు లేని ఆలయాలకు ప్రత్యేక కేటారుుంపులతో నిత్య కై ంకర్యాలతో పాటుగా అన్నదానం పథకం నిర్విరామంగా సాగేలా చేసిన భక్తురాలు. దేవుడి సేవలో ఉన్న పూజారుల్ని ఫించన్లు, ఆలయాల అభివృద్ధికి నిధులతో పాటుగా మానస సరోవరంలోని ముక్తినాథ్ యాత్రకు ప్రభుత్వం తరపున మార్గాన్ని చూపించిన ఘనత అమ్మదే. ఇక, అన్ని మతాలు తనకు సమానం అని చాటే విధంగా మసీదుల అభివృద్ధి, మత పెద్దలకు(ఇమామ్) ఫించన్లు, ప్రతి ఏటా హజ్ యాత్ర కోటా పెంపుతో పాటుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా రంజాన్ మాసంలో గంజి తయారీకి బియ్యం పంపిణీ చేయడం, చర్చ్‌ల అభివృద్ధి, క్రైస్తవ సోదరుల కోసం జెరూసలం యాత్రకు చర్యలు చేపట్టిన సర్వమత ప్రేమికురాలు.
అన్నదాతకు అండగా..
ఇక రుణాలు మాఫీ చేసినా, అన్నదాతకు అండగా పథకాలను ప్రవేశ పెట్టినా, పేత మహిళా రైతుల ఆర్థిక ప్రగతి పెంపునకు ఉచితంగా పశువులు, మేకల పంపిణీ, అన్నదాతలకు పనిముట్లను తక్కువ రుసుంకు అద్దెకు ఇవ్వడంలో, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమార్థం ముందుకు సాగినా అవన్నీ ప్రజాహితమే. ఎన్నికల సమయంలో ఇచ్చినా, ఇవ్వని హామీలను ఆచరణలో పెట్టడంలో జయలలితకు సాటి మరొకరు లేరు.