‘ప్లీజ్ సీఎంగారు.. మా సినిమా చూడండి’
బెంగళూరు: సాధారణంగా సమస్యలు ఉన్నవాళ్లే ముఖ్యమంత్రి నివాసం ముందు భారీ క్యూలు కడుతుంటారు. ఎంతకష్టమైనా వాటిని పరిష్కరిస్తామని హామీ వచ్చే వరకు అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి కూడా వారి సమస్యలు సావధానంగా వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం వారికి ముఖం కూడా చూపించడం లేదు. ఎందుకంటే వచ్చినవాళ్లంతా సమస్యలు ఉన్నవాళ్లు కాదు.. సినిమా నిర్మాతలు. అవును ఇప్పుడు పొద్దున లేస్తే సీఎం సిద్ద రామయ్య ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో సినీ నిర్మాతలే క్యూ కడుతున్నారు.
అందుకు కారణం ఆయన కార్యాలయ సిబ్బంది చేసిన పనే. ఇంతకీ వాళ్లేం చేశారంటే.. ఇటీవల సీఎం సిద్దు రాజ్‌కుమార్ నటించిన రాజకుమార వీక్షించారు. ఈ ఫొటోను ఆయన కార్యాలయ సిబ్బంది అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టింది. అనంతరం రాజ్‌కుమార్ సీఎం సిద్దరామయ్యను ప్రత్యేకంగా కలిసి ఇందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, ఇటీవలె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రభుత్వం తరుపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరొగొచ్చే సమయంలో విశ్రాంతి కోసం ఒకే రోజు బాహుబలి-2, నిరుత్తర అనే చిత్రాన్ని చూశారు.
దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన కార్యాలయ సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు నిర్మాతలంటూ ఆయన కోసం క్యూ కట్టారు. సాధారణంగా సీఎం సినిమా చూశారంటే ఆ సినిమాకి మంచి ప్రచారం కావున సీఎం తమ సినిమా అంటే తమ సినిమా చూడాలంటూ నిర్మాతలు తెగ ఎగబడుతున్నారు. అయితే, కాలేజీ రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసే తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పటికో చూసేందుకుగానీ వీలు కావడం లేదని, ప్రస్తుతం బిజీ పనుల కారణంగా ఎప్పుడుపడితే అప్పుడు చూడటం కుదరదని అన్నారు. నిర్మాతలకు తనపై ఉన్న ప్రేమకు ధన్యవాదాలని చెప్పారు.