ఎంపీ అహ్మద్ కన్నుమూత
నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: పార్లమెంటులో మంగళవారం గుండెపోటుకు గురైన ఎంపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఇ.అహ్మద్ (78) బుధవారం తెల్లవారుజామున మరణించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు తదితర నేతలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన చనిపోయినా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. మరణవార్త ప్రభుత్వ పెద్దలకు ముందే తెలిసినా బడ్జెట్‌కు ఆటంకం కలగొద్దనే దాచారని లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అహ్మద్ చనిపోయినట్లు వైద్యులు మంగళవారమే తనకు చెప్పారనీ, తర్వాత వారు మాటమార్చి బుధవారం ఈ విషయం ప్రకటించారని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ ఆరోపించారు.
అంతకుముందు ఆసుపత్రిలో అహ్మద్‌ను కలుసుకోడానికి ఆయన కుటుంబీ కులనూ వైద్యులు అనుమతించలేదని వార్తలొచ్చాయి. 1938లో జన్మించిన అహ్మద్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా చేశారు. ఆయనకు ‘గల్ఫ్ దేశాలకు భారత అనధికార రాయబారి’గా పేరుంది. 1967లో తొలిసారిగా కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదుసార్లు అసెంబ్లీకి, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004–12 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. 10 సార్లు ఐరాసకు భారత ప్రతినిధిగా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ హజ్ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. ఇంగ్లిష్, మలయాళాల్లో నాలుగు పుస్తకాలు రాశారు. అహ్మద్ భార్య ఇప్పటికే చనిపోయారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.