భోపాల్ : డెవిల్ హార్న్‌తో బాధ పడుతున్న ఓ వృద్ధుడికి వైద్యులు ఆపరేషన్ చేసి ఉపశమనం కలిగించారు. తలపై పుట్టుకొచ్చిన కొమ్ము వంటి ఆకారాన్ని సర్జరీ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. రాహి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ యాదవ్(74) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం తలకు గాయమైంది. క్రమేపీ గాయం తాలూకు నొప్పి తగ్గినప్పటికీ తలపై కొమ్ము లాంటి ఆకారం పెరుగుతూ వచ్చింది. తొలుత ఈ విషయాన్ని తేలికగా తీసుకున్న శ్యామ్‌లాల్ ఇంట్లో తనకు తానే దానిని కత్తిరించడం మొదలుపెట్టాడు. అయితే రోజురోజుకీ దాని ఆకారం పెరుగుతుండటంతో వైద్యులను ఆశ్రయించాడు.
ఈ క్రమంలో శ్యామ్‌లాల్ యాదవ్‌ను పరీక్షించిన భాగ్యోదయ్ తిర్త్ ఆస్పత్రి వైద్యులు అతడికి ఆపరేషన్ నిర్వహించి.. కొమ్ము వంటి భాగాన్ని తొలగించారు. అనంతరం ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ...శ్యామ్‌లాల్ ఇన్నాళ్లుగా డెవిల్స్ హార్న్‌గా పిలువబడే సబాకస్ హార్న్‌తో బాధపడ్డాడని తెలిపారు. సూర్యుడికి ఎక్సపోజ్ అయ్యే చర్మభాగంలో ఒక్కోసారి ఇలా చర్మం పొడుచుకు వస్తుందని పేర్కొన్నారు. కొమ్ము వంటి భాగం మూలాలు లోతుగా లేనందున..దానిని సులభంగా తొలగించామని వెల్లడించారు. ఈ అరుదైన కేసు గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితం చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment