
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సులేకు శుక్రవారం ముంబైలోని దాదర్ స్టేషన్‌లో వింత అనుభవం ఎదురైంది. ట్యాక్సీ కావాలా అంటూ ఓ వ్యక్తి దాదర్ స్టేషన్‌లో ఏకంగా ట్రైన్‌లోకి ఎంటరై తమను వేధించాడని ఆమె ట్వీట్ చేశారు. కుల్జీత్ సింగ్ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీఅవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని ఆమె దాదర్ స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ ఫిర్యాదుతో మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న అధికారులు నిందితుడికి జరిమానా విధించారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించి ప్రయాణీకులకు ఇలాంటి అనుభవం మరోసారి ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లు తమ సేవలపై ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఉంటే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అందుకు అనుమతించరాదని, ట్యాక్సీ స్టాండ్స్‌కే వాటిని పరిమితం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతనికి జరిమానా విధించామని రైల్వే పోలీసులు వివరించగా వారికి సుప్రియా ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్ల రైల్వే ప్రయాణీకులకు అసౌకర్యం వాటిల్లరాదని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment