
సీఏఏను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా అమలుచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సీఏఏ భారత్‌లో అంతర్భాగమైన బెంగాల్ సహా దేశమంతటా అమలవుతుందని చెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుగా చరిత్ర, రాజ్యాంగాన్ని అథ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు.
కాగా,బెంగాల్‌లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను తమ ప్రభుత్వం అమలు చేయబోదని, వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ తెలిపిన క్రమంలో నక్వీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా పౌరసత్వ చట్టం ద్వారా ఎవరి పౌరసత్వం కోల్పోయే పరిస్థితి ఉండదని తన కోల్‌కతా పర్యటన రెండవ రోజున ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. పౌర చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని దుయ్యబట్టారు.