
అఖిలేశే మా ముఖ్యమంత్రి అభ్యర్థి
ములాయం సింగ్ యూ టర్న్
• పార్టీలో అంతా కలిసే ఉంటాం.. కుటుంబంలో విభేదాల్లేవని స్పష్టీకరణ
• నేడు అఖిలేశ్–ములాయం ప్రత్యేక భేటీ!
• యూపీలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం
లక్నో/సాక్షి,న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తనే స్వయంగా ముగింపు పలకాలని పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ నిశ్చయించారు. పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం సమక్షంలో వాదోపవాదాలు పూర్తయి.. తీర్పుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సోమవారం రాత్రి అనూహ్య ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా కుమారుడు అఖిలేశ్ పేరును ప్రకటించారు. ‘ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేశ్ యాదవ్. ఇకపై పార్టీలో అందరం కలిసే ఉంటాం. మాలో ఎవరికీ భేదాభిప్రాయాల్లేవు’ అని స్పష్టం చేశారు. ‘మేమంతా ఒకటేనని చెప్పేందుకు త్వరలోనే యూపీలో పర్యటిస్తాం. ఎస్పీలో నెలకొన్న అనిశ్చితికి చరమగీతం పాడతాం’ అని ములాయం వెల్లడించారు. తనే పార్టీ చీఫ్‌నని అభ్యర్థులకు తనే బీఫారాలిస్తానంటూ సాయంత్రం ఢిల్లీలో ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఈ ప్రకటన చేయటం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. కాగా, మంగళవారం ఉదయం అఖిలేశ్ – ములాయం భేటీఅయ్యే అవకాశాలున్నాయి. అ తర్వాతేతదుపరి అంశాలపై స్పష్టత రానుంది.
ఢిల్లీలో కాదని.. లక్నోలో సై అని..
ములాయం సింగ్ యాదవ్ సోమవారం సాయంత్రం వరకూ పార్టీకి తానే జాతీయాధ్యక్షుడినని.. పార్టీపై సర్వహక్కులూ తనవేనన్నారు. కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి తనే పార్టీ చీఫ్‌నని.. సైకిల్ గుర్తు తనకే కేటాయించాలని కోరారు. ‘ఒక వ్యక్తి’ కారణంగానే పార్టీలో అంతా జరుగుతోందని.. పరోక్షంగా రాంగోపాల్‌పై విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడి పదవినుంచి తప్పించాలంటూ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు. కానీ తిరుగుప్రయాణమై లక్నోలో కాలు పెట్టగానే.. అఖిలేశ్ వర్గానికి రాజీ ఫార్ములాను ప్రతిపాదించారు. మొన్నటివరకు ఎన్నికలయ్యాకే సీఎం అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని.. తెగేసి చెప్పిన ములాయం.. ఇంత హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవటం విశేషం.
తర్వాత ఎలా?: ఎస్పీ సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ప్రకటించటంతోనే యాదవ కుటుంబంలో వివాదం సమసిపోలేదు. నామినేషన్ల సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై మళ్లీ పేచీ పెట్టకుండా ములాయం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే.. అఖిలేశ్‌తో ములాయం రాజీ కుదుర్చుకున్నా శివ్‌పాల్, అమర్‌సింగ్‌ల పాత్ర తగ్గుతుందనుకోవటానికి వీల్లేదు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న కీలకమైన తరుణంలో అఖిలేశ్, శివ్‌పాల్ వర్గాలను ములాయం ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.
మీ నాన్న మొండి వాడమ్మా!
లక్నోలో అఖిలేశ్, ములాయం ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. దీంతో అఖిలేశ్, డింపుల్‌ల పిల్లలు తాతయ్య ఇంట్లోకి వచ్చి వెళ్లటం సాధారణమే. పార్టీలో ఆధిపత్యపోరు జరుగుతున్నా పెద్దోళ్లు.. పిల్లలపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దీంతో అఖిలేశ్ కూతుళ్లు ఆదితి (15), టీనా (10) తాత (ములాయం) ఇంట్లోకి వెళ్లి ఆడుకుని వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన టీనాతో ములాయం సరదాగా ‘మీ నాన్న చాలా మొండి వాడమ్మా!’ అని అన్నారు. ఈ సందేశాన్ని టీనా నేరుగా అఖిలేశ్‌కు చేరవేసింది. దీనికి అఖిలేశ్ స్పందిస్తూ.. ‘అవును నేను మొండి వాడినే’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.