‘అఖిలేశ్‌తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్‌వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్‌వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్‌తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు.