
ఆ ప్రశ్నలకు సమాధానం దాటవేత
లక్నో: సమాజ్ వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ పునరాగమనంపై అడిగిన ప్రశ్నలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సమాధానం దాటవేశారు. అమర్ సింగ్ మళ్లీ సమాజ్ వాది పార్టీలోకి వచ్చే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... ఈ ప్రశ్నకు ఔచిత్యం లేదంటూ సమాధానమిచ్చారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని ములాయం పక్కనే కూర్చున్న ఆజాంఖాన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బేణి ప్రసాద్ వర్మ శుక్రవారం సమాజ్ వాది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ములాయం సింగ్ విలేకరులతో మాట్లాడినప్పుడు అమర్ సింగ్ పునరాగమనంపై పలు ప్రశ్నలు సంధించారు. వీటికి ములాయం జవాబివ్వలేదు. ఇటీవల అమర్ సింగ్ తరచుగా ములాయం, యూపీ సీఎం అఖిలేశ్ నివాసాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో మళ్లీ సమాజ్ వాది పార్టీలోకి వస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.