ముంబైలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 81 కు పెరగింది.
ముంబై: ముంబైలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 81కి పెరగగా, మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ఇంతమంది మరణించడం ఈ దశాబ్ధంలోనే రెండో సంఘటన. ఇంతకు ముందు 2004లో విక్రోలీలో కల్తీ సారా సేవించి 87 మంది మరణించారు. కల్తీ సారాకి బాధ్యులుగా భావిస్తున్న ప్రాన్సిస్ థామస్(46), సలీం మహబూబ్(39) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ సంఘటనలో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరింది.
ముంబైలోని లక్ష్మీనగర్ మురికివాడలో బుధవారం రాత్రి కల్తీ సారా ఘటన వెలుగుచూసింది. కాగా కల్తీ సారాను అరికట్టడంతో విఫలమైన ఎనిమిది మంది పోలీసులను ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా సస్పెండ్ చేశారు. ఈ ఘటన పై ఇప్పటికే సీఎం ఫడ్నవిస్ దర్యాప్తుకు ఆదేశించారు.