విషపూరిత కల్లుకు ఇద్దరి బలి?
మరొకరి పరిస్థితి విషమం
అనుమసముద్రంపేట :
విషపూరిత కల్లుతాగడంతో ఒకేసారి తీవ్ర అవస్థతకు గురైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా గురువారం ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మండలంలోని గుడిపాడులో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. గుడిపాడు పంచాయతీ అబ్బాసాహేబ్పేట డీలర్ సునీత భర్త రాజమోహన్ రెడ్డి (51), బీసీ కాలనీకి చెందిన గీతకార్మికుడు వెంకటరమణ్య స్నేహితులు. గుడిపాడు ఎస్సీ కాలనీకి చెందిన వీరరాఘవులు (17) ట్రాక్టర డ్రైవర్‌గా పని చేస్తూ వీరికి సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే రాజమోహన్‌రెడ్డి చెందిన తాటి చెట్ల నుంచి కల్లు గీసుకుని ముగ్గురూ తాగుతుంటారు. ఈ క్రమంలో సోమవారం ముగ్గురు కల్లు తాగినట్లు తెలుస్తోంది. మంగళవారం వెంకటరమణయ్య తీవ్ర అవస్థతకు గురై పిచ్చిపిచ్చగా మాట్లాడుతుండటంతో కుటుంబ సభ్యులు తొలుత ఆత్మకూరుకు, ఆ తర్వాత నెల్లూరుకు తరలించారు. బుధవారం ఒక్కసారిగా రాజమోహన్‌రెడ్డి, వీరరాఘవులు ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో నెల్లూరుకు తరలించారు. పరిస్థితి విషమించి ఇద్దరూ గురువారం మృతి చెందారు. అయితే వీరి మృతి కారణం పూర్తిగా నిర్ధారించలేకపోయినా వీరు తాగిన కల్లు విషపూరితం కావడం వల్లే ఈ దుస్సంఘటన జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజమోహన్‌రెడ్డి తోటలో గీసుకుంటున్న కల్లులో గిట్టని వారు ఎవరైనా విషం కలిపి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెంకటరమణయ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెంది ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు రాజమోహన్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరరాఘవులు అవివాహితుడు. చేతి కంది వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.
పోస్టుమార్టంలో నిగ్గుతేలుతుందా?
విషపూరితమైన కల్లుతాగి మృతి చెందినట్లుగా భావిస్తున్న ఇద్దరి మరణం వెనుక కారణం పోస్టుమార్టంలోనే తేలాల్సి ఉంది. అయితే వీరి మృతిపై కారణాలు ఏమిటనేది డాక్టర్లు ఇంకా నిర్ధారించలేదు. మృతదేహాలను గ్రామానికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. కల్లులో కల్తీ జరిగిందనే అనుమానాల నేపథ్యంలో సాక్షి ఎక్సైజ్ శాఖ అధికారులను సంప్రదించగా శుక్రవారం కల్లు కుండల్లో శాంపిల్ తీసి పరిశీలిస్తామని చెప్పారు.