
ముంబై: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి ముంబై అత్యంత ఖరీదైన నగరంగా మరోసారి నిలిచింది. జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్)లో ప్రపంచస్థాయి నగరాలైన మెల్‌బోర్న్, ఫ్రాంక్‌ఫర్ట్‌లను వెనక్కు నెట్టి ముందు వరుసలో నిలిచింది. కాస్ట్ ఆఫ్ లివింగ్–2018 (విదేశీయులకు)పై మెర్సర్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ స్థాయిలో 55వ స్థానంలో ముంబై నిలవగా.. మెల్‌బోర్న్ 58, ఫ్రాంక్‌ఫర్ట్ 68, బ్యూనస్ ఐరిస్ 76, స్టాక్‌హోమ్ 89, అట్లాంటా 95వ స్థానాల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది.
ఇక ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌లోని నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీ 103వ స్థానంలో, చెన్నై 144, బెంగళూరు 170, కోల్‌కతా 182వ స్థానాల్లో ఉన్నాయి. ఆహార పదార్థాలు, ఆల్కహాల్, గృహోపకరణ వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ముంబైలో జీవన వ్యయం పెరిగిందని సర్వే వెల్లడించింది.
ముఖ్యంగా నిత్యావసర వస్తువులైన మాంసం, పౌల్ట్రీ, బటర్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దేశంలోని మిగతా నగరాలకన్నా ముంబైలో భారీగా పెరిగాయని, సర్వే సమయంలో ఇక్కడ ద్రవ్యోల్బణం 5.57 శాతం ఉందని పేర్కొంది. మెర్సర్ సంస్థ సర్వే ఆధారంగా ప్రపంచ స్థాయి కంపెనీలు, ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాలు నిర్ణయిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 209 నగరాల్లో సర్వే నిర్వహించారు.