అత్యాధునిక 21వ శతాబ్దంలో ఉన్నాం. అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాం.. కానీ ఆడవారి విషయంలో అంతకంతకు దిగజారిపోతున్నాం. ఓ మహిళ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తుంది అంటే.. దాని వెనక ఎన్నో కారణాలు. ఆసక్తి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనుకోవడం.. ఆర్థిక అవసరాలు. కారణం ఏదైనా కావచ్చు. ఆమెకు మద్దతివ్వకపోయినా పర్వాలేదు.. మర్యాద మంట కలిసేలా ప్రవర్తించకపోతే సరి.
తోడుగా ఉంటానని బాస చేసిన భర్త వదిలేయంతో తనపై ఆధారపడిన ముగ్గురు బిడ్డల ఆకలి తీర్చడానికి ఓ తల్లి రోడ్డెక్కింది. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తుంది. అయితే తన ప్రయాణం అంత సాఫీగా సాగడం లేదని.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నానని.... కానీ తన పిల్లల కోసం వాటన్నింటిని భరిస్తున్నానని తన గాథను చెప్పుకొచ్చింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో వచ్చిన ఓ మహిళా ఆటో డ్రైవర్ కథ ఎంతో మందిని కదిలిస్తోంది.
అమ్మ రెండోపెళ్లి చేసుకుంది...
‘నా పేరు షిరీన్. నేను ఓ సంప్రదాయవాద, పేద ముస్లిం కుటుంబంలో జన్మించాను. నాకు 11 ఏళ్లు వచ్చే సరికి మా అమ్మనాన్న మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. వారి తగువుల మధ్య నేను ఎంతో నలిగిపోయాను.. నష్టపోయాను. కొద్ది రోజుల్లోనే మా అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారు. అయితే మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. అందుకే విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే పునర్వివాహం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని సమాజం అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఓ రోజు మా అమ్మ నా సోదరుడితో కలిసి బయటకు వెళ్లింది. అప్పుడు కొందురు మగవారు మా అమ్మ దగ్గరకు వచ్చి ఆమెను తిట్టడం ప్రారంభించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆమెను వ్యక్తిత్వాన్ని కించపరిచారు. నా సోదరుడిని కూడా అవమానించారు. ఇది మా అమ్మ మీద చాలా ప్రభావం చూపించింది. దాంతో అదే రోజు రాత్రి మా అమ్మ తన ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది’ అని అన్నారు షిరీన్.
‘మా అమ్మను కోల్పోవడం నా జీవితంలో అన్నింటకంటే పెద్ద విషాదం. దాన్ని నుంచి బయటపడేలోపే మా నాన్న నాకు, నా సోదరికి వివాహం జరిపించాడు. మా వివాహ జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. నా సోదరి గర్భవతిగా ఉండగా.. ఆమె అత్తింటి వారు విషం ఇచ్చి తనను చంపేశారు. ఇది నా జీవితంలో మరో పెద్ద షాక్. నేను ఎంతగానో ప్రేమించే అమ్మ, సోదరి నాకు దూరమయ్యారు. మొదటి సారి నా జీవితం అంధకారంగా మారింది అనిపించింది. జీవితం మీద ఆశలు కోల్పోయాను. అయితే అప్పుడే నేను గర్భవతిని అని తెలిసింది. నాకొక కొడుకు జన్మించాడు. వాడి కోసమైన బతకక తప్పని పరిస్థితి. ఈ లోపు నా సంసార జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. మూడో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా భర్త మా గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. అతనికి కేవలం నా శరీరంతో మాత్రమే పని. ఒకరోజు పడక గదిలో తన అవసరం తీరాక తలాక్ అంటూ మూడుసార్లు చెప్పి నాకు విడాకులు ఇచ్చాడు’ అని తన జీవితంలోని విషాదాన్ని వివరించారు షిరీన్.
తొలుత బిర్యానీ సెంటర్..
‘భర్త నిర్ణయం మేరకు... ముగ్గురు బిడ్డలతో రోడ్డు మీద పడ్డాను. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆదరించే వారు లేరు. ముగ్గురు బిడ్డల ఆకలి తీర్చాలి. దాంతో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. బిడ్డల ఆకలి తీర్చడమే నా ముందున్న అతిపెద్ద సవాలు. అందుకోసం ఓ చిన్న బిర్యానీ సెంటర్ ప్రారంభించాను. అది బాగా పుంజుకుంటున్న సమయంలో బీఎంసీ అధికారులు అనుమతులు లేవంటూ దాన్ని కూలదోశారు. మరోసారి రోడ్డున పడ్డాను. ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆటో రిక్షా నా కళ్ల ముందు కదలాడింది. నా భర్త ఆటో నడిపేవాడు. పిల్లల కడుపు నింపడం కోసం నేను కూడా ఆటో నడపాలని భావించాను. దాంతో నేను దాచుకున్న సొమ్ముతో ఓ ఆటో కొన్నాను’ అన్నారు షిరీన్.
‘ప్రస్తుతం ఆటో నడుపుతూ నా పిల్లలను పోషిస్తున్నాను. తద్వారా బాగానే సంపాదిస్తున్నాను. నా పిల్లలకు కావాల్సినవి సమకూర్చుతున్నాను. కానీ అవమానాలు మాత్రం తప్పడం లేదు. మహిళను కావడంతో జనాలు నన్ను చులకనగా చేసి చూడటం, అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇతర ఆటో డ్రైవర్లు కూడా నన్ను అణగదొక్కాలని చూస్తారు. కానీ వీటన్నింటిని తట్టుకుంటూనే.. ఏడాది కాలంగా ఆటో నడుపుతున్నాను. ఆ సంపాదనతోనే ఇళ్లు నడిపిస్తున్నాను. నా పిల్లల కోసం కారు కొనాలనేది నా కోరిక. త్వరలోనే దాన్ని కూడా సాధిస్తాను. అయితే అవమానాలే కాదు.. నా ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల్లో కొందరు నన్ను చాలా పొగుడుతుంటారు. చప్పట్లతో నన్ను అభినందిస్తూ.. టిప్పు కూడా ఇస్తారు’ అన్నారు.
భయ్యా కాదు..దబాంగ్ లేడీ
‘ఓ సారి ఓ గమ్మత్తయిన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి నా ఆటో ఎక్కాడు. నన్ను పురుషుడిగా భావించి.. భయ్యా అని పిలిచాడు. కానీ నేను మహిళనని తెలిసిన తార్వత నన్ను ‘దబాంగ్ లేడీ’ అని పిలిచాడు. నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మహిళలు తల్చుకుంటే ఏదైనా చేయగలరు. ఎవరో పెట్టిన నియమాలకు లోబడి స్త్రీ జీవించాల్సిన అవసరం లేదు. నా చెల్లి, తల్లిలా మరో మహిళ బాధపడకూడదనేది నా కోరిక. ఇదంతా నేను కేవలం నా కోసం మాత్రమే చేప్పడం లేదు.. నిశబ్దంగా బాధను భరిస్తున్న ప్రతి మహిళకు ధైర్యం చెప్పడం కోసమే నా కథను చెప్పుకొచ్చాను’ అన్నారు షిరీన్.
Comments
Please login to add a commentAdd a comment