ముంబై ఎయిర్‌పోర్టు చాలా రద్దీ గురూ..
► ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం
► ప్రతి 65 సెకండ్లకో విమానం
ముంబై: ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుగా ముంబై పేరు పొందింది. ప్రపంచంలో రద్దీ విమానాశ్రయాల్లో లండన్, గట్విక్‌లను దాటి మొదటి స్థానానికి వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ఒకే ఒక రన్‌వే ఉంది. ఇక్కడ ప్రతి 65 సెకండ్లకు ఓ విమానం ఎగరడమో, దిగటమో జరుగుతోంది. కార్గో విమానాలకు, ప్రయాణ విమానాలకు ఒకే రన్‌వే ఉండటంతో అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరుపొందింది. ప్రపంచంలోని పెద్ద విమానాశ్రయాలు ఢిల్లీ, దుబాయి, సింగపూర్, సిడ్నీ, లండన్, న్యూయార్క్‌ల్లో టేకాఫ్ ఒక రన్‌వే, లాండింగ్‌కు మరో రన్‌వేలు ఉన్నాయి. కానీ ముంబైలో ఒకే రన్‌వే గుండా టేకాఫ్, లాండింగ్ చేయాల్సి ఉంది. అందులో ఒకటి 927 మీటర్లు ఉన్న ప్రధాన రన్‌వే.. ఎప్పుడైన ఇది మరమ్మత్తులకు గురైతే రెండో 1432 మీటర్లు పొడవున్న రన్‌వేను ఉపయోగిస్తారు.
ఆర్థిక సంవత్సరం ముగింపు 2017 మార్చి 31 నాటికి ముంబై ఎయిర్‌పోర్టుగుండా 45.2 మిలియన్ల మంది ప్రయాణించారు. రోజుకు సుమారు 837 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున అత్యంత రద్దీ విమానాశ్రయం గట్విక్ (757) తో పోలిస్తే సుమారు 80విమానాలు ఎక్కువగా ఉన్నాయని సీనియర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతి రెండు అరైవల్స్(ఆగమనం)కి 130 సెకండ్ల టైంను కేటాయిస్తున్నారు. వీటి మధ్యలో ఒక డిపార్చర్ ను ఇస్తున్నామని ఆయన అన్నారు.