
గోరక్షకులుగా ముస్లిం యువకులు
జైపూర్: రాజస్థాన్‌లో రామ్‌గఢ్ ఓ గ్రామం. ఇది హర్యానాకు సరిహద్దులో ఉంది. గ్రామంలో ముస్లింల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ గ్రామంలో ముస్లిం యువకులు స్వచ్ఛందంగా గోరక్షకులుగా మారారు. హిందూ గోరక్షకులతో కలసి వీరు గోవులను కబేళాలకు విక్రయించకుండా, వాటిని ఎత్తుకుపోకుండా, చంపకుండా రేయింబవళ్లు కాపలాకాస్తున్నారు. ముస్లిం యువకుల్లో ఈ స్ఫూర్తిని నింపిందీ రామ్‌గఢ్ జమామసీద్‌కు మౌలానా మొహమ్మద్ ఇజ్రాయెల్.
‘గోవులను చంపాలని ఇస్లాం చెప్పడం లేదు. పాలిచ్చే గోవులపట్ల అమానుషంగా వ్యవహరించొద్దని చెబుతోంది. గోవులను ఎవరైనా చంపితే అందుకు హిందువులైన మా సహోదరులు మమ్మల్ని అనుమానించకూడదనే ఉద్దేశంతో గోవులకు రక్షకులుగా మేమూ ఉంటున్నాం’ అని మౌలానా మీడియాతో వ్యాఖ్యానించారు. గోమాంస భక్షకులని, గోవు హంతకులనే ముద్ర ముస్లింల మీద పడొద్దన్నది అక్కడి ముస్లిం యువకుల తాపత్రయం.
గోరక్షకుల్లో లాయర్లు, టీచర్లు, మార్బుల్ వ్యాపారులు, రాజకీయవేత్తలు, ఇతర వత్తుల వారు ఉన్నారు. రక్షించిన గోవుల సంరక్షణ కోసం ఈ గ్రామంలో గో రక్షణ కేంద్రాలు ఉన్నాయి. గోవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో పెహ్లూ ఖాన్‌ను హత్య చేసిన అల్వార్‌కు ఈ రామ్‌గఢ్ గ్రామం 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.