
హిరోషిమా ఘటనలో మృతులకు ప్రధాని నివాళి
హిరోషిమాపై ఘోర అణుబాంబు ప్రయోగానికి నేటికి 70 ఏళ్లు పూర్తయింది.
న్యూఢిల్లీ: హిరోషిమాపై ఘోర అణుబాంబు ప్రయోగానికి నేటికి 70 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జపాన్లో హిరోషిమా ఘటనలో మృతిచెందిన వారందరికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. ఆ రోజు జరిపిన బాంబుదాడి, యుద్ధాల వల్ల సంభవించే భయంకరమైన దృశ్యాలను గుర్తుకు తెస్తుందన్నారు. దాడుల వల్ల మానవత్వం మీద పడే ప్రభావం ఆ బాంబుదాడితో అర్థం అవుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
1945 సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన అగ్రదేశం అమెరికా జపాన్‌పై ఈ అణుబాంబు దాడి జరిపింది. ఈ దాడి జరిగిన క్షణాల్లోనే హిరోషిమా నగరం నేలమట్టమైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణుబాంబు దాడికి ఇదే. ఆ తర్వాత అదే ఏడాది తొమ్మిదిన నాగసాకిపై అమెరికా రెండో అణు బాంబును ప్రయోగించి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ప్రధాన స్థావరంగా హిరోషిమా నగరం ఉండేది. అందుకే ఈ నగరంపై అమెరికా కన్నుపడింది. ఫలితంగానే అమెరికా 1945, ఆగస్టు ఆరో తేదీన ఉదయం బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అణుబాంబును హిరోషిమాపై వేసింది. ఇలా మొదటిసారిగా అణుబాంబు ద్వారా ధ్వంసం చేసిన తొలి నగరంగా హిరోషిమా ప్రపంచ చరిత్ర పుటలకెక్కింది. అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే 70 వేల మందికి పైగా మరణించగా, అణుధూళి వల్ల మరో 90 వేల నుంచి లక్షా 40 వేల మంది మరణించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. నేటికి ఈ సంఘటన జరిగి సరిగ్గా 70 సంవత్సరాలు. 1955 నాటికి పూర్తిగా కోలుకున్న ఈ నగరం.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.
My homage to all those who lost their lives in Hiroshima. The bombings remind us of the horrors of war & their effect on humanity.
— Narendra Modi (@narendramodi) August 6, 2015