'నేను ఇండియన్.. నా కొడుకు శవం కూడా చూడను'
తిరువనంతపురం: ఎప్పుడూ అబ్బజాన్ అబ్బజాన్ అనే పిలిచే తన కుమారుడు అనూహ్యంగా తనను కఫీర్(దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి, దేవుడిని వ్యతిరేకించే వ్యక్తి అని అర్థం) అంటూ పిలిచి తనను అవాక్కయ్యేలా చేశాడని అబ్దుల్ హకీమ్ అనే ఓ తండ్రి చెప్పాడు. అతడి కుమారుడు అయిన హఫీసుద్దీన్(22) గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు. అతడితోపాటు మరికొందరు కేరళ వాసులు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరేందుకు వెళ్లిపోయారని ఇటీవల వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజం అన్నట్లుగా నిన్న ముంబయిలో కేరళకు చెందిన ఓ జంట కూడా పట్టుబడింది.
ఈ నేపథ్యంలో పోలీసులు, మీడియా ప్రతినిధులు కనిపించకుండా పోయినవారి ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హఫీసుద్దీన్ తండ్రి మీడియాకు విస్తుపోయే విషయాలు చెప్పాడు. తన కుమారుడు పూర్తిగా తీవ్ర భావజాలానికి లోనయ్యాడని, దిగ్భ్రాంతికి గురయ్యేలా అబ్బజాన్ అని పిలవడం మానేసి కఫీర్ అనడం మొదలుపెట్టాడని, తన కుమారుడు పూర్తిగా మారిపోయాడని చెప్పారు.
'నా కన్నకొడుకే నన్ను కఫీర్ అని పిలిచాడు. వాడిని తీవ్రభావజాలం పూర్తిగా మార్చేసింది. ఒక రోజు నాకు మెస్సేజ్ పెట్టాడు. అందులో నాకు ఇప్పుడు స్వర్గం దొరికింది. అందులో పన్నులు లేవు. ప్రత్యేక షరియా చట్టం లేదు. ఇక్కడ నన్నెవరు పట్టుకునే వారు లేరు. ఇది నిజంగా చాలా మంచి చోటు అనిరాశాడు' అని చెప్పారు. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ 'అతడు భారతదేశాన్ని ఇష్టపడకుంటే.. ఈ దేశానికి వ్యతిరేకంగా ఏదైనా పనిచేస్తే అతడు నాకొడుకైనా నాకొద్దు. వాడి శవాన్ని కూడా చూడను. అసలు వాడు అలా ఎలా మారాడనే దానిపై నాకు ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. నేను ఒక భారతీయుడిని.. వాడు చస్తే ఆ శవాన్ని కూడా చూడాలనుకోను' అని ఆయన చెప్పారు.
కాలికట్ లో ఖురాన్ చదివేందుకని ఇంట్లో నుంచి బయలుదేరిన హఫీజుద్దీన్ ఆ తర్వాత మరిన్ని చదువులకోసం శ్రీలంక వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. ఈద్ సందర్భంగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తాను ఒక కారణం కోసం స్వర్గానికి వెళుతున్నానని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడనే విషయం మాత్రం చెప్పలేదు.