
పరిచయస్తుడే ప్రాణం తీశాడా?
మొబైల్ కాల్స్‌పై పోలీసుల దృష్టి
తృప్తిమయి హత్య కేసులో పురోగతి
బరంపురం : బరంపురం కళ్లికోట్ వర్సిటీ విద్యార్థి తృప్తిమయి పండా హత్య కేసులో ఆశించిన రీతిలో పురోగతి కనిపిస్తోంది. బాగా తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఛత్రపూర్‌కు చెందిన తృప్తిమయి పండా స్థానిక అనంత నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. గత నెల 25న రాత్రి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లోని సోంపేట, బారువ మధ్య గల బేసిరామచంద్రపురం జాతీయ రహదారి పక్కన రక్తపు మడుగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. హ త్య జరిగిన వారం రోజులైనా నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు ఆంధ్ర, ఒడిశా పోలీసులకు సవాల్‌గా మారింది.
సీసీ కెమెరాలో కారు
తృప్తిమయి పండా హత్య కేసుకు సంబంధించి పోలీసులకు కీలకమైన ఆధారం లభించిందని తెలిసింది. తృప్తిమయి పండా ప్రయాణిస్తున్న కారు ఒడిశా సరిహద్దు దాటుతున్నట్లు గిరిసిలా చెక్‌పోస్ట్‌లోని సీసీ కెమెరాలో నమోదైంది. ఘటన జరిగిన రోజున గిరిసిలా చెక్‌పోస్ట్‌లోని సీసీ కెమెరాల ఫుట్టేజీలు గంజాం పోలీసులు సేకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని పోలీసులు తెలిపారు.
ఫోన్ కాల్స్ సేకరణ
విద్యార్థి హత్య కేసు మిస్టరీ ఛేదించడానికి ఆంధ్ర, ఒడిశా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఆధారాల సేకరణలో మునిగిపోయారు. ఆమె ఫోన్ కాల్స్ లిస్ట్‌ను ఆంధ్ర పోలీసులు సేకరించినట్లు తెలిసింది. తృప్తిమయి ఎవరితో మాట్లాడింది, ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి, ఆఖరి ఫోన్ ఎవరు చేశారని ఆరా తీస్తున్నారు. ఆమె చివరి ఫోన్ కాల్ ఎవరికి చేసిందని ఆరా తీస్తున్నారు.
తెలిసినవారే హంతకులు?
విద్యార్థిని తృప్తిమయితో బాగా పరిచయం ఉన్న వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఆలస్యమైతే నిందితులు రాష్ట్రం నుంచి పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. విద్యార్థిని హత్య కేసు ఇరు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారింది.