నగ్రోటా ఆర్మీ క్యాంప్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోటాలో ఉన్న ఆర్మీ యూనిట్‌పై దాడి కోసం ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు తేలింది. సైలెన్సర్ గన్‌తో సెంట్రీని కాల్చి చంపి ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. గతనెల 29న నగ్రోటాలోని ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ రోజు తెల్లవారుజామున 5.30కు ముగ్గురు ముష్కరులు ఒక్కసారిగా ఆర్మీ యూనిట్‌పై కాల్పులు జరుపుతూ, గ్రెనేడ్లతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది వారిని మట్టుబెట్టింది. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించిన ఆర్మీ అధికారులు పలు ఆధారాలు గుర్తించారు.
దీని ప్రకారం, తొలుత ఆర్మీ క్యాంప్ ప్రాంగణాన్ని సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫెంట్ గ్రాస్ ద్వారా ప్రవేశమార్గం వద్దకు వచ్చారు. అక్కడున్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి లోపలికి ప్రవేశించారు. సెంట్రీని చంపినట్లు ఒకరు గుర్తించగానే ప్రాంగణంలో కొంత భయానక వాతావ రణం ఏర్పడింది. సైనిక కుటుంబాలున్న భవంతిలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తుం డటాన్ని సైనికులు గుర్తించారు. సైనికుల కుటుంబాలను బందీలు చేసుకునే అవకాశముందని గుర్తించిన బలగాలు ముందుగా పారాకమాండోల సాయంతో పిల్లల్ని, మహిళల్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం ఉగ్రవాదులపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే డ్రోన్ల సాయం తీసుకొని క్యాంప్‌లోని పలుచోట్ల నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించి తుదముట్టించారు.