నవ్యాంధ్ర నిర్మాణమే లక్ష్యం | Naidu vows to make Andhra Pradesh investment-friendly | Sakshi
Sakshi News home page

నవ్యాంధ్ర నిర్మాణమే లక్ష్యం

Published Wed, Nov 5 2014 5:08 AM | Last Updated on Sat, Jul 28 2018 4:52 PM

నవ్యాంధ్ర నిర్మాణమే లక్ష్యం - Sakshi

నవ్యాంధ్ర నిర్మాణమే లక్ష్యం

* అందు కోసం నట్లు, బోల్టులు జోడిస్తున్నా
* అవకాశాలను ఉపయోగించుకుంటా
* ఏపీ సీఎం చంద్రబాబు

సాక్షి, బెంగళూరు : నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నట్లు, బోల్టులు జోడిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అత్యుత్తమ రాజధానిని నిర్మించగలననే నమ్మకం తనకుందన్నారు. బెంగళూరు పర్యటనలో భాగంగా మంగళవారమిక్కడ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన చెందడంలో ఒక మంచి, ఒక చెడు ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మరింత సరికొత్తగా నిర్మించుకోగల అవకాశం రావడం మంచి పరిణామమైతే.. రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికంగా, అభివృద్ధి విషయంలో కుదుపులు ఏర్పడడం ఇబ్బందికరపరిణామమని పేర్కొన్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఐటీ రంగానికి అధిక అవకాశాలున్నాయని, మనదేశంలోని యువశక్తి సైతం అభివృద్ధికి దోహదం కానుందని అన్నారు. గత పదేళ్లలో కేంద్రంలో ప్రభుత్వం సరిగ్గా లేకపోవడం వల్ల దేశం లో అభివృద్ధి చాలా వరకు కుంటుపడిందని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, ప్రధానమంత్రి నరేంద్రమోది సైతం ‘డిజిటల్ ఇండియా’ను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
 
అనుమతి ఇవ్వక పోయినా ఉత్పత్తి మొదలుపెట్టవచ్చు?
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు గాను మంగళవారం సాయంత్రమిక్కడి ఓ హోటల్‌లో సీఐఐ సంస్థ సహకారంతో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు, వస్తు ఉత్పత్తికి కావలసిన అనుమతులను వేగంగా, పారదర్శకంగా అమలు చేయడానికి వీలుగా వినూత్న విధానాలను అమ లు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు భూ కేటాయింపులకు సంబంధించిన అనుమతులు మంజూరైన తర్వాత నాలుగు వారాలు లేదా ముప్పైరోజుల్లోపు మిగిలిన (విద్యుత్, నీరు తదితర) కేటాయింపులకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోతే సదరు సంస్థ వస్తు ఉత్పత్తిని ప్రారంభించవచ్చునని (డీమ్డ్ పర్మిషన్) స్పష్టం చేశారు.

దేశంలో మరే రాష్ట్రం ఇలాంటి విధానం అమల్లో లేదని పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక, ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతాననిఅన్నారు. ఏపీమొత్తంలో 14 నౌకాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. ఏపీలో ఏ రాష్ట్రంలో లే నంతగా సహజ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులను పుష్కలంగా లభిస్తాయని అన్నారు. పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాన్ని వివరించే బ్రోచర్‌లను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అంతకుముందు బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమంలో ఫోరమ్ కార్యకర్తలు చంద్రబాబును మైసూరు పేట, శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement